వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉప‌సంహ‌రించుకోవాలి : మంత్రి సీత‌క్క‌

Publish Date:Jun 29, 2026

Advertisement

 

వీబీజీ రామ్‌జీ చట్టంపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించిన సీత‌క్క‌..

న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ చట్టం అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను మంత్రి సీతక్క వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర ప్రభుత్వ తరఫున వినతిపత్రాన్ని అందజేశారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, కొత్త చట్టంలో రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం మోపే నిబంధనలు ఉన్నాయని, వాటిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిందని తెలిపారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

గతంలో ఉపాధి హామీ పథకం కింద కూలీల వేతన భారం 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించేదని, మెటీరియల్ కాంపోనెంట్‌లో కూడా కేంద్రం 75 శాతం వాటా కల్పించేదని గుర్తు చేశారు. కొత్త విధానంలో 60:40 నిష్పత్తి అమలు చేయడం వల్ల రాష్ట్రాలపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వాటా కొన్ని వందల కోట్ల రూపాయల పరిధిలో ఉండగా, కొత్త విధానంలో తెలంగాణ వాటా సుమారు రూ.2,000 కోట్ల వరకు పెరిగే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

వీబీజీ రామ్‌జీ చట్టంలో ప్రతిపాదించిన కొన్ని నిబంధనలు పేదలు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా చట్టాన్ని తీసుకురావడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. చట్టానికి పేరు మార్చడమే కాకుండా, అమలులో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక బాధ్యతలు మోపడం సరైన విధానం కాదన్నారు.

అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఇతర కీలక అంశాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద రెండు సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి కేంద్రానికి పంపించినప్పటికీ ఇప్పటికీ ఇళ్ల మంజూరు జరగలేదని, వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తెలంగాణలో మంజూరైన అనేక రహదారి పనులు అటవీ, వన్యప్రాణి అనుమతుల సమస్యలతో నిలిచిపోయాయని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లమల, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో రోడ్లు, నివాసాలు, బోర్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం కూడా అటవీ అనుమతుల కారణంగా నిలిచిపోతోందని వివరించారు. రోడ్లకు కేంద్రం మంజూరు ఇచ్చినప్పుడే అటవీ శాఖ నుంచి అవసరమైన క్లియరెన్స్‌లు కూడా కల్పించే విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారని, అటవీ అనుమతుల సమస్యల పరిష్కారం కోసం సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

వీబీజీ రామ్‌జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టమని, రాష్ట్ర ప్రయోజనాలు, గ్రామీణ పేదల సంక్షేమం, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే మంత్రివర్గం తుది నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కొత్త చట్టంలో చేరాలా, వద్దా అనే అంశంపై జూలై 2న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నిర్ణయం తెలియజేస్తామని మంత్రి తెలిపారు.

సమావేశంలో నూత‌న చ‌ట్టంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌

 వీబీజీ రామ్‌జీ చట్టానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అభ్యంతరాలు, సూచనలను సమావేశంలో మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను హక్కు ఆధారిత కార్యక్రమంగానే కొనసాగించాలని, ప్రతిపాదిత వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కొత్త చట్టం గ్రామీణ పేదల పని హక్కును బలహీనపరచడంతో పాటు గ్రామ పంచాయతీల అధికారాలను తగ్గించి, రాష్ట్రాల పాత్రను పరిమితం చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రణాళిక, పనుల ఎంపిక, నిధుల కేటాయింపు, అమలు, పర్యవేక్షణ వంటి కీలక అధికారాలను కేంద్రం వద్దే కేంద్రీకరించడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా మాత్రమే నిధుల కేటాయింపు చేయడం సమంజసం కాదని, గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న వాస్తవ ఉపాధి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయించాలని తెలంగాణ సూచించింది. గత ఐదేళ్లలో రాష్ట్రాలకు కల్పించిన పని దినాలకు 80 శాతం, ఆర్థిక సంఘం సిఫార్సులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రతిపాదించింది. వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఐదో షెడ్యూల్ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కోరారు.

కొత్త చట్టంలో కేంద్రం కేవలం 60 శాతం మాత్రమే నిధులు భరిస్తుండగా, మిగిలిన 40 శాతం రాష్ట్రాలపై భారం పడుతోందని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రాయోజిత పథకాల వల్ల రాష్ట్రాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగిందని, మరింత భారం మోపడం అమలును క్లిష్టతరం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాలతో సమగ్ర సంప్రదింపులు జరపకుండానే చట్టం రూపొందించడం సరికాదని, రాష్ట్రాలకు ప్రణాళిక, అమలు, పర్యవేక్షణలో మరింత అధికారాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

నూతన చట్టంలో అనుమతించే పనుల జాబితాను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం, వ్యక్తిగత భూఅభివృద్ధి పనులు, వరదల అనంతర పునరుద్ధరణ పనులు, న్యూట్రి గార్డెన్లు, వెదురు తోటలు, కూరగాయల పందిళ్లు, పశుగ్రాస అభివృద్ధి, వర్క్‌షెడ్లు వంటి స్థానిక అవసరాలకు అనుగుణమైన పనులను చట్టంలో చేర్చాలని సూచించింది. రాష్ట్రాల స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త పనులను ఆమోదించే స్వేచ్ఛ కల్పించాలని మంత్రి కోరారు.

పథకంలో ప్రతిపాదించిన తప్పనిసరి 60 రోజుల ఉపాధి విరామాన్ని పూర్తిగా ఉపసంహరించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధన గ్రామీణ పేద కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంత్రి వివరించారు. రైతుల ప్రయోజనాలు, ఉపాధి కూలీల ప్రయోజనాలు పరస్పర విరుద్ధం కాదని, గ్రామీణ పరిస్థితులు రాష్ట్రానికో, ప్రాంతానికో భిన్నంగా ఉంటాయని చెప్పారు. 

ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఐదో షెడ్యూల్ ప్రాంతాలు, నీటి ఎద్దడి ప్రాంతాలు, మొక్కల పెంపకం కార్యక్రమాలు, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల పనులకు ఈ నిబంధన నుంచి మినహాయింపులు కల్పించాలని సూచించారు. తెలంగాణలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాలకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో 90:10 కేంద్ర రాష్ట్ర నిధుల నిష్పత్తిని అమలు చేయాలని కూడా కోరారు.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, భూమిలేని వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు, ఇతర బలహీన వర్గాల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా కొత్త చట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల నుంచే వచ్చే వాస్తవ ఉపాధి డిమాండ్ ఆధారంగా ప్రణాళిక, పనుల ఎంపిక, నిధుల కేటాయింపు జరిగితేనే అత్యంత వెనుకబడిన గ్రామాలకు సమర్థవంతంగా ప్రయోజనం చేకూరుతుందని మంత్రి సీతక్క తెలిపారు.

గ్రామీణ పేద కుటుంబాల ఉపాధి హక్కులను పరిరక్షించడం, గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం, రాష్ట్రాలకు తగిన స్వేచ్ఛ, గౌరవం కల్పించడం ద్వారా మాత్రమే గ్రామీణాభివృద్ధి లక్ష్యాలు సమర్థవంతంగా సాధ్యమవుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, సహకార సమాఖ్య స్ఫూర్తితో గ్రామీణ భారత అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
 

By
en-us Political News

  
సీఎం చంద్రబాబును కలిసిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ..
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంలో సోమవారం ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి.
అల్వాల్‌లో సంచలనం సృష్టించిన నిత్య పెళ్లికొడుకు కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ తీపి కబురు అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏకైక రాజధానిగా అమరావతి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
దేశం మొత్తం ఏపీ విద్యా మోడల్ గురించే మాట్లాడాలి...
కేజీఎఫ్ చేతులెత్తేసిన చోట తవ్వకాలు సాధ్యమా...?
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.