స్మగ్లింగ్ గేమ్.. పట్టుకోండి చూద్దాం..
Publish Date:Apr 30, 2021
Advertisement
స్మగ్లింగ్ మాఫియా , డ్రగ్స్ మాఫియా రోజు రోజుకు కొత్త టెక్నిక్స్ తో కొత్త పుంతలు తొక్కుతుంది. అధికారులకు దొరకకుండా కొత్త పధకాలు వేస్తుంది. అందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటుంది. ఎవరికీ అనుమానం విగ్రహాల్లోను. లో దుస్తువుల్లోనూ డ్రగ్స్ దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు. తినే ఆహార పదారాల్లో దూర్చి దేశం దాటిచేస్తున్నారు. మరికొందరు మత్స్యకారుల బోటు మాటున తరలిస్తున్నారు. ఇలా ఒక్కటా రెండా.. ఎన్నో కొత్త టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ఎలా చేస్తారో వీడొక్కడే సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను మింగి, వాటిని కడుపులో దాచుకొని మలేషియాకు తరలించే సీన్.. ఈ మూవీకే హైలైట్. ఐతే అచ్చం అలాంటి ఘటనే ముంబై ఎయిర్‌పోర్టులో జరిగింది. కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్ దాచుకొని ఇండియాకు తరలించిన ఇద్దరు ఆఫ్రికన్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 22న ఇద్దరు టాంజానియా దేశస్థులు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎప్పటిలాగే ఎయిర్‌పోర్టులో అధికారులు తనిఖీలు చేశారు. వారి ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. అంతేకాదు చాలా నీరసించి పోయినట్లు కనిపించడంతో అనమానం పెరిగింది. వెంటనే ఎయిర్‌పోర్టులోని స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షించారు. వారి పొట్టలో పెద్ద మొత్తంలో క్యాప్సుల్స్ కనిపించాయి. అధికారులకు వెంటనే వీడొక్కడే సినిమా గుర్తొచ్చింది. అనంతరం క్యాప్సుల్స్ బయటకు తీసి చెక్ చేస్తే.. అందులో కొకైన్ కనిపించింది. మొత్తంగా 2.22 కేజీల కొకైన్ ఉంది. దాని విలువ రూ.13.35 కోట్ల వరకు ఉంటుంది.ఇద్దరు నిందితులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషిల్ కస్టడీ విధించింది. దీని వెనక ఎవరున్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరికి ఇవ్వాలనుకున్నారు? అనే కోణంలో ఆరాతీస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. వీడొక్కడే సినిమాల్లో అచ్చం ఇలాంటి సన్నివేశం ఉంటుంది. హీరో సూర్య ఫ్రెండ్ జగన్, మరికొందరు కూలీలు కడుపులో డ్రగ్స్ దాచుకొని మలేషియాకు తరలిస్తున్నారు. క్యాప్సుల్స్‌ను తేనెలో ముంచుకొని మింగేస్తారు. మలేషియా వెళ్లిన తర్వాత ఏనీమా ఇచ్చి సరుకును బయటకు తీస్తారు. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్ కడుపులో ఓ క్యాప్సుల్ పంక్చర్ అవుతుంది. అలా డ్రగ్స్ అతడి శరీరంలో కలిసిపోయి ప్రాణాలు కోల్పోతాడు. ఆ కూలీలకు డ్రగ్స్ ముఠాతో ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరు ఇఛ్చారో.. ఎవరు తీసుకుంటారన్న వివరాలు తెలియదు. కేవలం డ్రగ్స్‌ను దేశం దాటించే వరకే వారి బాధ్యత. మిగతా పనంతా డ్రగ్స్ ముఠా చూసుకుంటుంది. అలా డ్రగ్స్ తరలించినందుకు కూలీలకు రూ.50వేల నుంచి లక్ష వరకు ఇస్తారు. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే జరగడంతో.. డ్రగ్స్ స్మగ్లింగ్‌పై మరింత నిఘా పెట్టారు పోలీసులు. ఇక హైదరాబాద్ లో గ్రైండర్ మాటున తరలిస్తున్న అక్రమ బంగారాన్ని గురువారం శంషాబాద్ విమానాశ్రయ భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం..హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈకే-526 విమాన సర్వీస్‌లో స్వదేశానికి వస్తున్నాడు. ఈ క్రమంలో 2.8కిలోల బంగారాన్ని కరిగించి గ్రైండర్ ఆకారంలో తయారు చేసి లోపలి భాగంలో బిగించి తెస్తున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వస్తున్న సదరు ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని సామగ్రిని పరిశీలించగా అక్రమ బంగారం గుట్టురట్టయింది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
http://www.teluguone.com/news/content/smuggling-batch-arrest-in-mumbai-39-114578.html





