జల యుద్ధానికి ఉగ్ర కుట్ర?!..
Publish Date:Jul 17, 2026
Advertisement
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు తెరలేపింది. భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచడంతో, ఈసారి భూమార్గాలను విడిచిపెట్టి జలమార్గాల ద్వారా చొరబడేందుకు వాటర్ ఫోర్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వాటర్ ఫోర్స్ నీటి అడుగున ఉండి పోరాడేందుకు ఇస్తున్న శిక్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో లష్కరే ఉగ్రకుట్ర బయటపడింది. దీంతో భారత నిఘా రక్షణ వర్గాలు అలర్టయ్యాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని పంజాబ్ సరిహద్దుల మధ్య ఉన్న మంగ్లా డ్యామ్ వేదికగా లష్కరే ఈ ఉగ్ర శిక్షణ ఇస్తుండటం.. ఆందోళన కలిగిస్తున్నది. 2008 నవంబర్ 26న ముంబై దాడులకు తెగబడ్డ అజ్మల్ కసబ్ బృందం కూడా అప్పట్లో.. ఇదే మంగ్లా డ్యామ్‌లో నావిగేషన్, సముద్రయాన శిక్షణ పొందింది. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో లష్కరే కమాండర్ మహమ్మద్ అష్ఫాక్ పర్యవేక్షణలో వాటర్ ఫోర్స్ శిక్షణ సాగుతుండటం గమనార్హం. ఈ శిక్షణలో భాగంగా.. ఉగ్రవాదులు కంబాట్ స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ పరికరాల సహాయంతో గంటల తరబడి నీటి అడుగున ఉండడం, అత్యాధునిక హై-స్పీడ్ రబ్బర్ బోట్లను నడపడంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు లీకైన విడియోలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదకర కుట్ర వెనుక అసలు సూత్రధారి, అమెరికా ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన హారిస్ దార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్తాన్‌లోని షేక్‌పురా ప్రాంతంలో లష్కరే కొత్త రిక్రూట్లకు శిక్షణ ఇస్తూ భారత సార్వభౌమాధికారానికి నేరుగా సవాలు విసిరేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తూ.. దార్ ఇండియా తమ నీటిని ఆపాలని చూస్తే.. తాము భారతీయుల ఊపిరి ఆపేస్తామని పేర్కొన్నాడు. 2026లో అంటే ప్రస్తుత సంవత్సరంలోనే ఇండియాపై వాటర్ వార్ చేస్తామంటూ దార్ హెచ్చరించాడు. ఇప్పుడు మంగ్లా డ్యామ్ లో ఉగ్ర శిక్షణ జరుగుతుండటం గమనార్హం. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న ప్రత్యక్ష, పరోక్ష మద్దతుకు ఈ మంగ్లా డ్యామ్ శిక్షణా దృశ్యాలే సాక్ష్యమని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిఘా వర్గాల విశ్లేషణ ప్రకారం, లష్కరే తోయిబా కేవలం సాంప్రదాయ ఆయుధాలు, భౌతిక దాడులకే పరిమితం కాకుండా, తమ వ్యూహాన్ని మార్చి ఏఐ, సైబర్ దాడులు, డీప్‌ఫేక్ ప్రచారాలను కూడా ఆయుధాలుగా వాడుకుంటోంది. ఇండియాలో అలజడి సృష్టించడానికి, క్లిష్టమైన సమాచారాన్ని చోరీ చేయడానికీ ఏఐ టూల్స్ వినియోగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు సోషల్ మీడియా ద్వారా భారతీయ యువతను తప్పుదోవ పట్టించేందుకు హైక్వాలిటీ వీడియోలను మానసిక యుద్ధ తంత్రంలా ఉపయోగిస్తోంది. అయితే పాక్ నుంచి వచ్చే ఎలాంటి సవాలునైనా దీటుగా ఎదుర్కొని కోలుకోలేని దెబ్బతీయడానికి భారత్ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంది. అంతర్జాతీయ రక్షణ అధ్యయన సంస్థ సిప్రి' నివేదికల ప్రకారం, ఇండియా రక్షణ చర్యలలో భాగంగా మున్నెన్నడూ లేనంతగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ అరిహంత్ వంటి అణు జలాంతర్గాములలో న్యూక్లియర్ వార్‌హెడ్‌లను భారత్ లైవ్‌గా సన్నద్ధం చేసింది. శత్రు దేశాల నుండి ఎలాంటి జల చొరబాట్లు, దాడులు జరిగినా.. క్షణాల వ్యవధిలో కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ కొట్టేందుకు నౌకాదళాన్ని సర్వసన్నద్ధం చేసింది. అలాగే.. గుజరాత్ తీరం నుండి ముంబై, కేరళ మీదుగా విస్తరించి ఉన్న తీరప్రాంతం వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్, నౌకాదళం గస్తీని ముమ్మరం చేశాయి. సముద్ర మార్గాల్లో అనుమానాస్పద బోట్ల కదలికలను ముందే గుర్తించేందుకు వీలుగా తీరప్రాంత రేడార్ వ్యవస్థలను ఆధునీకరించారు. లష్కరే జల యుద్ధ హెచ్చరికల నేపథ్యంలో, శత్రువుల ఆటకట్టించడానికి భారత్ ప్రదర్శిస్తున్న సైనిక నిశ్చయత దేశ భద్రతా పరంగా అత్యంత కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో తీరప్రాంత నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని రక్షణ శాఖ భావిస్తోంది. Lashkar e Taiba, Water Force, Mangla Dam Terror Training, Indus Waters Treaty 2026, Haris Dar Pakistan, Indian Navy INS Arihant High Alert
http://www.teluguone.com/news/content/sinister-plot-for-water-war-36-226242.html





