అప్పన్న సాక్షిగా అర్చకుల రచ్చ.. యథా రాజా తథా..!
Publish Date:Jun 24, 2021
Advertisement
ఏపీలో ఆలయాలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఈ ధోరణి మరింత పెరుగుతోందనే విమర్శ ఉంది. ఇన్నాళ్లూ టీటీడీలో అర్చక వివాదం చూశాం. ప్రధాన అర్చకుని హోదా రగడ హైకోర్టు వరకూ వెళ్లింది. ఇక టీటీడీలో అన్యమత రచ్చ అంతా ఇంతా కాదు. ఎస్‌వీబీసీ యవ్వారంలో టీటీడీ అబాసుపాలైంది. అటు బెజవార దుర్గమ్మ ఆలయ వెండి రథ సింహాలు మాయం, ఆరోపణలతో ఆలయ ఈవోపై వేటు.. అంతర్వేది రథం దగ్థం, రామతీర్థం విగ్రహ ధ్వంసం.. ఇలా జగన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచీ రెండేళ్లుగా ఏపీలోని ఆలయాలు వివాదాలకు కేంద్రాలుగా మారడం కలకలం రేపుతోంది. తాజాగా, సింహాచలం అప్పన్న సన్నిధిలో వర్గ పోరు అర్చకుల పరువు తీసింది. సింహాచలం అప్పన్న సన్నిధిలో ఆధిపత్య పోరు ముదిరింది. దేవుని సేవలో ఉండాల్సిన అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి పరోక్షంగా దేవదూషణకు పాల్పడటం విమర్శల పాలవుతోంది. ఒక వర్గం అర్చకులు ఆలపించిన గీతాలను అపహాస్యం చేస్తూ మార్ఫింగ్‌కు పాల్పడ్డారు మరో వర్గం అర్చకులు. వారు పాడిన సింహాచల అప్పన్న పాటలను అన్యమత గీతాలుగా, వీధి పాటలుగా మార్చేసి వీడియోలు వైరల్ చేసింది మరోవర్గం. నిత్యం స్వామివారి సన్నిధిలో గడిపే అర్చకులు ఇలాంటి పనులకు పాల్పడటం చూసి భక్తులు మండిపడుతున్నారు. ఇవేం దిక్కుమాలిన పనులంటూ అసహ్యించుకుంటున్నారు. ఇటీవల అప్పన్న ఆలయంలో నారసింహుడి గరుడోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో నారసింహ గర్జనలను సీతారాం అనే అర్చకులు ఆలపించారు. ఆ ఆడియోను మరో వర్గం అర్చకులు మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తోంది. స్వామి వారి గర్జనలను మార్చేసి.. అర్చకుల వీడియోకు మరో మతం గీతాల ఆడియో జోడించారు. మరికొన్ని వీడియోలను వీధిపాటల ఆడియోతో మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. ఆ మార్ఫింగ్ వీడియో చూసిన మరో వర్గం అర్చకులు.. ఘటనపై మండిపడుతున్నారు. అర్చకుల మధ్య విభేదాలు ఉంటే వారు వారు చూసుకోవాలి కానీ దేవుడితో పరాచకాలు ఆడటమేంటని భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం ముదరడంతో.. ఆలయ ఈవో సూర్యకళ.. స్థానాచార్యులు, అర్చకులతో సమావేశం నిర్వహించారు. పూజారుల మధ్య సఖ్యతకు ప్రయత్నించారు. కానీ, అవేవీ ఫలితం ఇచ్చినట్టు లేవు. అప్పన్న సాక్షిగా జరుగుతున్న అర్చకుల రచ్చను అంతా తప్పుబడుతున్నారు. ఆలయం పరువు తీస్తున్న అర్చకులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/simhachalam-appanna-swamy-temple-priest-controversy-25-118301.html





