సిగాచీ షేర్లు ఢమాల్!
Publish Date:Jul 3, 2025
Advertisement
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ పడిపోయింది. ఒక్కొక షేర్ పై దాదాపుగా రూ.14 నష్టం వచ్చింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడం, ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కార్మికులు, కంపెనీ సిబ్బంది మృత్యువాత పడటం తెలిసిందే. ఈ సంఘటన తరువాత ఆ కంపెనీ షేర్ వాల్యూ స్టాక్ మార్కెట్ లో బారీగా పతనమైంది. దీంతో సిగాచి ఇండస్ట్రీస్ సంస్థ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తమ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపిన ప్రమాదం పై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి లేఖ రాసింది. పాశమైలారం సిగాచీ ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. ప్రమాదనికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందనీ, హైదరాబాద్ ప్లాంట్ లో మూడు నెలలపాటు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా సిగాచీకి నాలుగు పరిశ్రమలున్నాయి. పాశమైలారంతో పాటు సుల్తాన్ పూర్, కర్ణాటకలోని రాయచూర్, గుజరాత్ లోని జగడియ, ధహేజ్ లలో మొత్తం 4 పరిశ్రమలు నడుస్తున్నాయి. సంస్థకు వేల కోట్ల మార్కెట్ వాల్యూ ఉంది. సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ 1989లో సిగాచి క్లోరో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది. 2012లో వాణిజ్యపరంగా విస్తరించేందుకు సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. 2019లో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కావడంతో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఇండస్ట్రీకి సుమారుగా రూ.1680 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్నట్టు చెబుతన్నాయి కంపెనీ గణాంకాలు. ఈ కంపెనీ ఫార్మా రంగంలో ముడి సరుకు సహాయ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రమాదం జరిగిన పాశమైలారం యూనిట్లో- మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ పౌడర్ అనే ప్రొడక్ట్ ని తయారు చేస్తోంది. వీటితోపాటు యాక్టివ్ ఫార్మాస్యుటికల్ ఇంగ్రిడియంట్స్ ను తయారు చేస్తోంది. ఇది బైండింగ్ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది. డ్రగ్ తయారీలో ఈ ఔషధాన్ని ఉపయోగించి మనం నిత్యం వినియోగించే ఔషధాలు తయారు చేస్తారు. ఏడాదికి ఈ ఒక్క ప్లాంట్ ద్వారానే 6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఎండీ కమ్ సీఈవోగా అమిత్ రాజ్ సిన్హా, చైర్మన్ గా రవీంద్ర ప్రసాద్ సిన్హా, వైస్ చైర్మన్ గా చిదంబరనాథన్ ఉన్నారు. ప్రమాదం జరిగిన పాశమైలారం సిగాచి ప్లాంటు కార్యకలాపాలన్నీ వైస్ చైర్మన్ చిదంబరనాథన్ అధ్వర్యంలో జరుగుతాయని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/sigachi-company-shares-fall-sharply-39-201155.html





