ఎలాన్ మస్క్ యూటర్న్.. సొంత పార్టీ లేనట్టేగా?
Publish Date:Jul 3, 2025
Advertisement
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్రపంచంలో ఉన్న ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఆయనకా క్రెడిట్ దక్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మస్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు కలిసిపోయారా? ఆల్ ఆఫ్ ఏ సడెన్ గా ఎలాన్ మస్క్ ట్రంప్ ను పొగుడుతూ కామెంట్ చేయడమేంటి? అన్న ప్రశ్నలు జనబాహుల్యం నుంచి ఉత్పన్నమౌతున్నాయి. నిజానికైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిన వెంటనే తాను ద అమెరికా పార్టీ స్థాపించడం తథ్యమని మస్క్ తెగేసి చెప్పారు. ఈ లోగా ట్రంప్ ఒక కామెంట్ చేశారు. అసలు మస్క్ తన పెట్టేబేడా సర్దుకుని సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంటుంది. మేము ఇప్పటి వరకూ ఆయనకు అన్నేసి సబ్సిడీలను ఇచ్చామని బాంబు పేల్చారు ట్రంప్. దెబ్బకు జడుసుకున్న మస్క్ ట్రంప్ ని వెనకేసుకొచ్చారు. క్రెడిట్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిందే అన్నారు. ఇజ్రాయెల్ గాజాలో అరవై రోజుల కాల్పుల విరమణకు ఒప్పుకుందని ట్రంప్ ప్రకటించిన వెంటనే ఆయనీ ట్వీట్ పోస్ట్ చేశారు. ట్రంప్- మస్క్ స్నేహ బంధం 2016 నాటిది. వీరిద్దరూ ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో సార్లు విడిపోయి, కలిసిపోయిన చరిత్ర ఉంది. వీరిద్దరి గరించి ద గార్డియన్ పత్రిక 2024లో ఇద్దరు సంపన్న మిత్రుల మధ్య గాఢ ప్రేమానుబంధంగా అభివర్ణిస్తూ ఓ వ్యాసం ప్రచురించింది. మస్క్ కి ట్రంప్ కి ఉన్న గాఢ స్నేహానుబంధం ఎలాంటిదంటే.. ట్రంప్ ఒక దశలో ట్విట్టర్ ఖాతాను కోల్పోయారు. దీంతో ఆయన జోబైడెన్ చేతుల్లో ఓడి పోవల్సి వచ్చిందప్పట్లో. అయితే గత ఎన్నికల నాటికి అదే ట్విట్టర్ ని కొని దానికి ఎక్స్ అన్న నామకరణం చేసి.. దానిలోని ట్రంప్ ఖాతాను రీ- జనరేట్ చేశారు మస్క్. అంతేనా.. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ మీద విరుచుకుపడ్డారు కూడా. ఆ ఎన్నికలపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ఎట్టకేలకు గెలిచాం కదా అనుకుంటే ట్రంప్ నుంచి మస్క్ కు ఆశించినంత సాయం అందలేదు. ఎన్నో విషయాల్లో ట్రంప్ మస్క్ కి మస్కా కొట్టారు. ఇస్తానన్నవేవీ ఇవ్వక పోగా.. మస్క్ కి పబ్లిక్ లో తీవ్ర వ్యతిరేకత కొట్టొచ్చినట్ట కనిపించింది. డోజ్ ద్వారా ఆయన తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా.. తన టెస్లా షోరూములు ధ్వంసం కావడం.. ఆపై షేర్ల ధరలు పడిపోవడం అటుంచితే.. తన సంపద వంద బిలియన్ డాలర్ల మేర ఆవిరయ్యింది. అంతేనా తన మిత్రుడిని నాసా చీఫ్ చేస్తానన్న మాట కూడా మరిచారు ట్రంప్. ప్రశాంతంగా కొత్త కొత్త ఐడియాలతో బిజినెస్ చేసుకోకుండా.. అనవసరంగా విరాళమిచ్చి మరీ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి వ్యతిరేకతను మూటగట్టుకోవడం అవసరమా? అంటారు మస్క్ తండ్రి ఎరోల్ మస్క్. ప్రస్తుతం మావాడికేం పెద్ద వయసు అయిపోలేదనీ.. న్యూరాలింక్ అనే కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడనీ.. అదిగానీ క్లిక్ అయితే దశ తిరిగిపోతుందని అంటారాయన. కారణం మస్క్ కొత్త ప్రాజెక్టు వెన్నుముక విరిగిన వారికి సంసార జీవితం, కంటి చూపులేని వారికి చూపు ప్రసాదించే దివ్య ఔషధం. అలాంటి ప్రాజెక్టు వర్కవుట్ అయితే పోయిన సంపద అంతకు అంతగా మారి తిరిగి వస్తుంది. ప్రస్తుతం మస్క్ వయసు 53 ఏళ్లు కాగా.. సంపద విలువ 300 బిలియన్ డాలర్లు. ట్రంప్ లా లాస్ట్ స్టేజ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ నెట్ ప్రాక్టీస్ గా పడి ఉంటుంది లెమ్మని.. కాస్త ఎర్లీగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మస్క్.. ఆల్ ఆఫ్ ఏ సడెన్ గా పార్టీ పెట్టేస్తా అనగానే అందరూ షాకయ్యారు. ఇప్పుడు చూస్తే పార్టీ లేదూ గీర్టీ లేదు తూచ్ అంటున్నారు. మరి చూడాలి. ట్రంప్ తో ఈ చెలిమి కంటిన్యూ అవుతుందా లేక ఇద్దరి మధ్యా మళ్లీ వివాదం మరింత ముదిరి.. కొత్త పార్టీకి దారి తీస్తుందా? తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
http://www.teluguone.com/news/content/elan-musk-uturn-praises-trump-39-201151.html





