మహిళ ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు దర్యాప్తు బదిలీ.!
Publish Date:Jul 22, 2026
Advertisement
నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న ఈ కేసును ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. మహిళలకు సంబంధించిన సున్నితమైన కేసు కావడంతో ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, తదుపరి దర్యాప్తును షీటీమ్స్‌కు అప్పగించారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో విచారణ కొనసాగించానున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు తెలిపిన నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. డిశ్చార్జ్ అనంతరం వైద్యుల అనుమతి మేరకు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. కేసు దర్యాప్తులో ఆయన వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి పేరుతో ఉన్నట్లు భావిస్తున్న ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులోని అంశాలు, కేసులోని ఇతర ఆధారాలతో సరిపోల్చి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణలో ప్రభుత్వం, పోలీసుల తరఫున సమర్పించే వాదనలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు షీటీమ్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగం పుంజుకోగా, మరోవైపు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. sexual harassment case against female trainee IPS officer, transferred to women saftey wing, Uday Krishnareddy, Sucide, Attempt
http://www.teluguone.com/news/content/sexual-harassment-case-against-female-trainee-ips-officer-transferred-to-women-saftey-wing-36-226741.html





