తమ్మినేని సీతారాం యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్.. తీర్పు 27కు రిజర్వ్.!
Publish Date:Jul 24, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యుల ముందస్తే బెయిలు పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే అభియోగంపై నమోదైన కేసులో తమ్మినేని ముందస్తే బెయిలు పిటిషన్ పై ఏపీ హైకోర్టు శుక్రవారం (జులై 24) విచారించింది. నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి, తన తీర్పును ఈనెల 27కి రిజర్వ్ చేశారు. కోర్టు విచారణ సమయంలో బాధితుడి తరఫు న్యాయవాదులతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి ఈ మొత్తం అక్రమ రిజిస్ట్రేషన్ కుట్రకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. శ్రీకాకుళంలో విలువైన భూమిని దక్కించుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ మార్గాల్లో ఈ భూమిని తమ్మినేని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆధారాలతో సహా కోర్టు ముందుంచారు. మరోవైపు.. తమ్మినేని తరఫు న్యాయవాదులు సదరు భూమి కొనుగోలు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, దానికోసం బంగారాన్ని కుదువపెట్టి మరీ తమ క్లయింట్లు రుణం పొందినట్లు పేర్కొన్నారు. నకిలీ ధ్రువపత్రాల సృష్టితో గానీ, ఫోర్జరీ వ్యవహారాలతో గానీ తమ్మినేని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అయితే పోలీసుల దర్యాప్తు వివరాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. శ్రీకాకుళం నగర పరిధిలోని సదరు భూమికి సంబంధించిన అసలు యజమాని క్షేమంగా బతికే ఉన్నప్పటికీ, ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించానీ, కొంతమంది అపరిచితులను నకిలీ వారసులుగా చిత్రీకరించి, వారి నుంచి కొనుగోలు చేసినట్లు కాగితాలు తయారుచేసి తమ్మినేని సీతారాం కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ ముగించారనీ పోలీసుల దర్యాప్తు లో తేలింది. అంతే కాకుండా పోలీసులు ఆ కేసును తమంతట తాము టేకప్ చేయలేదు.. తాను బతికుండగానే తనను చనిపోయినట్లు చూపి, కోట్ల విలువైన ఆస్తిని కాజేసేందుకు కుట్ర పడ్డారంటూ సదరు భూమి అసలు యజమాని శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి పలు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో తమ్మినేని ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల ఉద్యోగులే ప్రధాన సాక్షులుగా మారి వాంగ్మూలం తమ్మినేనికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఉద్యోగుల వాంగ్మూలంతో ఈ దందాను నడిపించిన అసలు సూత్రధారి తమ్మినేని సీతారామేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గతంలో కూడా ఈ కేసును కొట్టివేయాలంటూ తమ్మినేని హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆ అర్జీని తిరస్కరించిన విషయం తెలిసిందే. అరెస్టు భయంతో తమ్మినేని కుటుంబం కొంతకాలంగా పరారీలో ఉండి, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నది. Thammineni Seetharam, AP High Court, Fake Land Registration Case, Srikakulam Land Scam, Anticipatory Bail Petition
http://www.teluguone.com/news/content/verdict-on-tammineni-sitarams-anticipatory-bail-petition-reserved-36-226993.html





