లండన్ కోర్టులో నీరవ్ మోడీకి షాక్..వంద కోట్లు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు
Publish Date:Jun 24, 2026
Advertisement
దేశంలో బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్‌లో తలదాచుకుంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఒక కీలక కేసులో నీరవ్ మోదీ.. తన కంపెనీ రుణం కోసం ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీ కింద 10.7 మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 100 కోట్లకు పైగా మొత్తాన్ని కచ్చితంగా చెల్లించాల్సిందేనని కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే మార్చి, ఏప్రిల్ 2018 తో పాటు ఇటీవల అక్టోబర్ 2025లో కూడా బ్యాంకు తరఫున నీరవ్ మోదీకి, ఆయన కంపెనీకి అధికారిక డిమాండ్ నోటీసులను పంపింది. కానీ.. లండన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీ ఆ నోటీసులను పట్టించుకోలేదు. అంతేకాకుండా.. లండన్ కోర్టులో ఈ గ్యారెంటీ చెల్లదని, తనకు సరైన డిమాండ్ నోటీసులు అందలేదంటూ తప్పించుకునేందుకు రకరకాల వాదనలు వినిపించారు. అయితే.. ఈ సాకులు ఏవీ లండన్ కోర్టు ముందు నిలవలేదు. పీఎన్‌బీ కుంభకోణం కారణంగా ఫైర్‌స్టార్ గ్రూప్ వ్యాపార కార్యకలాపాలు, నీరవ్ మోదీ అప్పులు తీర్చే ఆర్థిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అందుకే బ్యాంకు రుణాన్ని వెనక్కి తీసుకోవడం పూర్తిగా సమర్థనీయమేనని స్పష్టం చేస్తూ, నీరవ్ మోదీ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. అసలు మొత్తం 4.1 మిలియన్ డాలర్లతో పాటు దానికి సంబంధించిన వడ్డీని కూడా కలిపి మొత్తం రూ. 100 కోట్లను నీరవ్ మోదీ నుండి వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది. 2019 మార్చిలో లండన్‌లో అరెస్ట్ అయినప్పటి నుండి యూకే జైల్లో మగ్గుతున్న నీరవ్ మోదీకి ఈ తాజా తీర్పుతో ఆర్థికంగా, చట్టపరంగా ఉచ్చు మరింతగా బిగిసుకున్నట్లయింది. సిబిఐ, ఈడీ లాంటి భారతీయ దర్యాప్తు సంస్థలు నీరవ్ మోదీని దేశానికి రప్పించడానికి, ప్రజాధనాన్ని రికవరీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో లండన్ కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ బ్యాంకులకు చాలా పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా జులై 2012లో దుబాయ్ వేదికగా నడుస్తున్న ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్‌జెడ్‌ఈ అనే నీరవ్ మోదీకి చెందిన కంపెనీకి ఒక భారీ రుణాన్ని మంజూరు చేసింది. ఆ సమయంలో ఈ భారీ రుణకోసం.. నీరవ్ మోదీ వ్యక్తిగత పూచీకత్తు పత్రాలపై సంతకాలు చేశారు. అయితే.. 2018లో రూ. 13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ ఆర్థిక సంక్షోభాన్ని గమనించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ వెంటనే తాము ఇచ్చిన రుణాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/setback-for-nirav-modi-in-london-court-36-223970.html





