పంచాయతీ సిత్రాలు సూడరో!.. సుసైడ్ విన్నర్ ఎవరో తెలుసా?
Publish Date:Dec 15, 2025
Advertisement
సింగిల్ ఓట్ విన్నర్స్ అనే మాట వినే ఉంటాం ఆ మాటకొస్తే లక్కీ డ్రా విన్నర్స్ అనే క్యాప్షన్ కూడా చదివే ఉంటాం.. ఈ సూసైడ్ విన్నర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నికల్లో వెలుగులోకొచ్చిన కొత్త పదం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండలం, పిపడ్ పల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు. సర్పంచ్ అభ్యర్ధిగా పోటీ చేసిన రాజుది ఓ విషాద గాథ. మద్ధతుదారులు సహకరించడం లేదనీ, ఎన్నికల్లో ఖర్చుకు డబ్బుల్లేవన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు రాజు. ఈ నెల 8న అతడు ఉరి వేసుకుని చనిపోగా.. సర్పంచ్ ఎన్నికలలో అతడు గెలవడం పంచాయితీ ఎన్నికల చరిత్రలోనే కొత్త రికార్డుగా నమోదయ్యింది. అతడి మరణం కారణంగా మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. ఏది ఏమైనా రాజు సూసైడ్ విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడన్న చర్చ జరుగుతోంది. ఇక సింగిల్ ఓట్ విన్నర్లు ఎవరెవరున్నారో చూస్తే.. నిర్మల్ జిల్లా, బాగాపూర్ గ్రామంలో ముత్యాల శ్రీవేద అనే మహిళ ఒకే ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా గెలిచారు, ఈమెకు పోటీగా బరిలో నిలిచిన హర్ష స్వాతికి కూడా 180 ఓట్లే వచ్చాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా.. ఒక్క ఓటు కారణంగా శ్రేవేదను విజయం వరించింది. అమెరికా నుంచి వచ్చిన తన మామ వేసిన పోస్టల్ ఓటు ఆమె విజయానికి కారణమైంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్‌ఖుర్ద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బెస్త సంతోష్ సంచలన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.. చివరకు సంతోష్ తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సంతోష్‌ను చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ప్రతి ఓటూ కీలకమని ఈ ఫలితం నిరూపించిందని అంటున్నారు అధికారులు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌పాడు గ్రామ పంచాయతీలో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుదారుడైన రమేశ్ నాయక్, కాంగ్రెస్ మద్దతుదారుడిపై విజయం సాధించారు. అయితే ఈ విజయం నల్లేరు మీద నడకలా సాగలేదు. ఎంతో సస్పెన్స్ తో జరిగిన కౌంటింగ్‌లో రమేశ్ నాయక్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో ప్రత్యర్థిని ఓడించి సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం, రామాపూర్ గ్రామ పంచాయతీలో కూడా ఇదే తరహా ఫలితం వెలుగు చూసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమాదేవి తన ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. చివరి రౌండ్ వరకు ఇద్దరి మధ్య ఓట్లు సమానంగా వస్తాయేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. చివరకు ఫలితం వెలువడేసరికి రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలుపు సాధించారు.
http://www.teluguone.com/news/content/see-the-strange-happenings-in-the-panchayat-elections-25-210997.html





