ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా.. ఆగస్టు నుంచి సంజీవని : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 25, 2026

Advertisement

 

ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని...ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మీ ఆరోగ్యం... మీ చేతుల్లో ఉంటుందని... ప్రభుత్వం అందించే సంజీవని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం సాంకేతికతను జోడిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న సంజీవని ప్రాజెక్ట్ ప్రత్యేకతలను సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... విద్య, వైద్యం మీదే ప్రతి కుటుంబం అత్యధికంగా ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును రూపొందించామని సీఎం తెలిపారు. ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న ఈ కార్యక్రమంలో ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి.. కుటుంబ సభ్యులందరికీ ఆభా హెల్త్ ఐడీలు జారీ చేస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అనుసంధానం చేస్తామని వివరించారు.

ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ ఇదే సంజీవని విధానం..

ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత చికిత్స ఇవ్వడమే కాదు.. వ్యాధులు రాక ముందే గుర్తించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైనప్పుడు సమర్థవంతమైన వైద్యం అందించడమే సంజీవని లక్ష్యమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 80 లక్షల మంది తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నట్లు నివేదికలు వచ్చాయని.. అలాంటి పరిస్థితులను తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మాతా-శిశు ఆరోగ్యం, బాలల ఆరోగ్య పరీక్షలు, 108 అత్యవసర సేవలు, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ-ఔషధి, ల్యాబ్ సేవలను ఒకే డిజిటల్ వ్యవస్థలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత వైద్య సహాయం, టెలీమెడిసిన్, రిమోట్ కేర్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, డిజిటల్ నర్వ్ సెంటర్లను సంజీవనిలో భాగం చేస్తామని సీఎం తెలిపారు. సంజీవని సిటిజన్ వెల్‌నెస్ యాప్ ద్వారా ప్రజలు వైద్యుల అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవడంతో పాటు తమ ఆరోగ్య రికార్డులను ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేయడం ఒక్కటే సరిపోదని.. ప్రజల్లో కూడా ఆరోగ్య చైతన్యం పెరగాలని సీఎం సూచించారు. మంచి ఆహారం, యోగా, ధ్యానం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన కుటుంబం.. ఆరోగ్యవంతమైన గ్రామం.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

సంక్షేమం నుంచి సౌర విద్యుత్ వరకు.. ప్రతీ కుటుంబానికి అండగా ప్రభుత్వం..

ప్రజారోగ్యంతో పాటు సంక్షేమానికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తూ పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని.. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రూ.20 వేల సాయం అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి మద్దతు, స్త్రీశక్తి ద్వారా మహిళల సాధికారత, దీపం-2.0 ద్వారా గ్యాస్ సబ్సిడీ, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల్లో గందరగోళం సృష్టించి వివాదాలకు కారణమయ్యారని సీఎం విమర్శించారు. రీసర్వే ద్వారా అన్ని భూ రికార్డులను బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భద్రపరుస్తున్నామని తెలిపారు. 

ప్రతి నెలా 9వ తేదీన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తూ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నామని.. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. హీరో మోటార్స్, ఎల్‌జీ, దాల్మియా వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని.. రూ.1 లక్ష కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను ఉద్యాన, పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కర్నూలు-బళ్లారి రైల్వే లైన్‌కు కేంద్రం ముందుకు రావడం సంతోషకరమన్నారు.

వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిన నేపథ్యంలో రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జల ధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వేదవతి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మూడు ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ రూపొందించామని తెలిపారు. కర్నూలు జిల్లాలో రూ.1,768 కోట్లతో వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 

గత ప్రభుత్వం ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు పైసా ఖర్చు పెట్టలేదని.. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని సీఎం విమర్శించారు. ఒక్క ఎకరాకు కొత్తగా నీళ్లు ఇవ్వలేదని.. ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. డ్రిప్ సబ్సిడీలు ఎత్తేసినవారే ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నం పెడుతుంటే గత పాలకులు సహించలేక పోయారని... గత పాలకులు రాష్ట్రంలో ప్రతీ వ్యవస్థను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. గొడ్డలి పార్టీ నేతలను.. వారు చేసే మోసపూరిత రాజకీయాలను విశ్వసించ వద్దని ముఖ్యమంత్రి కోరారు.

పరదాలు కట్టడం లేదు... చెట్లు నరకడం లేదు..

సంజీవని కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ అనంతరం అదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అధికార యంత్రాంగం పనితీరును సమీక్షించారు. శాఖల మంచి పనితీరు కనపరిచిన అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పం తీసుకుని పనిచేస్తున్నామని క్షేత్ర స్థాయి వరకూ అంతా సమర్ధంగా పనిచేసినప్పుడే ప్రజలకు మేలు చేయగలమని అన్నారు. ఇప్పటి వరకు తాను 50 బహిరంగ సభల్లో ఇదే విధంగా అధికారులు, ఉద్యోగుల పనితీరును ప్రజలకు వివరించానని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అధికార యంత్రాంగంతో ముఖ్యమంత్రి గ్రూప్ ఫొటో దిగారు. కర్నూలు జిల్లాలోని స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.197 కోట్ల చెక్కును అందజేశారు. ప్రసంగిస్తున్న సమయంలో వినతిపత్రాలు ఇచ్చేందుకు కొందరు ప్రయత్నించటంతో సభ ముగిసిన అనంతరం వాటిని తీసుకుంటానని సీఎం వారికి వివరించారు. తాను ప్రజలందరినీ కలుస్తానని.. గత పాలకుల లాగా పరదాలు కట్టుకుని తిరగటం లేదని, చెట్లను నరికించి సమావేశాలు పెట్టటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. 

సీఎం అంటే సచివాలయంలో కూర్చునే చీఫ్ మినిస్టర్ మాత్రమే కాదని.. ప్రజల మధ్య ఉండే కామన్ మ్యాన్ అని చెప్పారు. అందుకే ప్రతి నెలా ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటూ... వాటికి పరిష్కారంగా ప్రజా విధానాలు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, స్థానిక కూటమి పార్టీల నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sanjeevani Scheme, CM Chandrababu, Aspari, Kurnool District, Aluru, AP Government, Minister satyakumar
 

By
en-us Political News

  
జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన భారత కేంద్రమంత్రుల చరిత్ర..!
దేశరాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.
2024 సాధారణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గణనీయంగా మారిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన పెద్ద ఎత్తున సాగిన నిరసన ఘట్టం ఎట్టకేలకు ఒక సంచలనాత్మక ముగింపునకు వచ్చింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు మొత్తం గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తున్నాయి.
ఉద్యోగాలే లేకుంటే ఏఐ విజయం ఎందుకు.. మైక్రోసాఫ్ట్ బాస్ సంచలన వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పరీక్షా వివాదం విద్యార్థుల ఆందోళనల నడుమ కేంద్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు
  నిరాహార దీక్షలో ఉన్న తనను   సందర్శకులు  కలవకుండా ఆంక్షలు విధించారని వాంగ్ చుక్ ఆరోపంచారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.