మే 1 నుంచి 15 వరకూ తిరుమలలో బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు.. సిఫారసు లేఖలకు నో
Publish Date:Apr 28, 2025
.webp)
Advertisement
వేసవి సెలవులు కావడం, ఇంటర్ టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా వారాంతాలలో అయితే తిరుమల కొండపై ఇసుక వేస్తే రాలనంతగా భక్త జనసందోహం ఉంటోంది. ఎలా చూసినా సగటున రోజుకు 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకూడదు, వారికి స్వామి వారి దర్శనం త్వరితగతిన చేయించాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి 15వ తేదీ వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించింది. నేరుగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే, ఎంపీ ఇతర అధికార, ప్రముఖుల సిఫారసు లేఖలతో వచ్చేవారికి బ్రేక్ దర్శనాలకు కల్పించరాదని నిర్ణయించింది. అంటే ఎటువంటి సిఫారసు లేఖలను పరిగణనలోనికి తీసుకోదన్న మాట. అయితే శ్రీవాణి, డోనర్స్ దర్శనాలు యథావిధిగా అమలు అవుతాయి.
గత ప్రభుత్వ హయాంలో తిరమలకు వచ్చే వీఐపీలకు అనువుగా బ్రేక్ దర్శనాలను మార్పు చేశారు. అప్పటి వరకు ఉన్న ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాల స్థానంలో ప్రోటోకాల్, రెఫెరల్, జనరల్ గా మార్పు చేశారు. అదే విధంగా దర్శన సమయాన్ని కూడా మార్పు చేశారు. వైసీపీ హయాంలో వేకువ జామున 5 గంటల నుంచి ఉన్న దర్శన సమయాన్ని ఉదయం 7.30 గంటలకు జనరల్ దర్శనం 10 గంటల కు ప్రోటోకాల్.. శ్రీవాణి... రెఫరల్, డోనార్స్, ఎంప్లాయిస్ ను అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే బ్రేక్ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనానికి తీవ్ర ఆలస్యం జరిగేది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొలువుదీరిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ దర్శన వేళల్లో మార్పు చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తొలి బోర్డు సమావేశంలో నే దర్శన సమయాన్ని మార్పు చేస్తామని ప్రకటన చేశారు. మే నెల 1 నుంచి 15 వరకు రద్దీ పెరుగుతున్న తరుణంలో ప్రయోగాత్మకంగా దర్శన సమయాన్ని మార్పు చేయనుంది. మే 15 వరకు ఉదయం 6 గంటలకు ప్రోటోకాల్ దర్శనం అమలు చేయనున్నారు. దీని పై భక్తుల అభిప్రాయాలు సేకరించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
http://www.teluguone.com/news/content/sanctions-on-break-darshans-39-197052.html












