మంగళగిరి పీఎస్ లో సజ్జల
Publish Date:Oct 17, 2024
Advertisement
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావలసిందిగా సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసు మేరకు సజ్జల మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు బుధవారం విలేకరులతో మాట్లాడిన సజ్జల తనకు పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని, తనపై లుక్ ఔట్ నోటీసు జారీ చేయడాన్ని తప్పు పట్టారు. కక్ష సాధింపు కాక మరోటి కాదన్నారు. పోలీసు వ్యవస్థను తెలుగుదేశం కూటమి నిర్వీర్యం చేసేసిందని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇన్ని ప్రశ్నలు వేసినా సజ్జల నోటీసు అందుకుని పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాక తప్పలేదు. వాస్తవానికి సజ్జల సంధించిన ప్రశ్నలూ, చేసిన విమర్శలూ అన్నీ స్వయంగా తనను ఉద్దేశించి చేసుకున్నట్లుగా ఉన్నాయని పరిశీలకులు పరిశీలకులు అంటున్నారు. గత ప్రభుత్వంలో అంటే జగన్ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారు. ఆ పోస్టులో ఆయన పని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం మాత్రమే. అంటే సజ్జల పాత్ర మొత్తం తెరవెనుకనే ఉండాలి. కానీ సజ్జల తెరముందుకు వచ్చేశారు. జగన్ సర్కార్ మంచి చెడ్డలన్నిటిలోనూ సజ్జల ప్రమేయం ఉంది. పాత్ర ఉంది. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. సకల శాఖల మంత్రిగా అన్ని శాఖలపైనా పెత్తనం చెలాయించారు. అంతేనా జగన్ కు కళ్లూ, చెవులూ, నోరూ కూడా సజ్జలే అన్నట్లుగా సజ్జల హవా సాగింది. జగన్ అధికారంలోకి వచ్చింది లగాయతూ, ఘోర పరాజయం వరకూ జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా ఉన్నది సజ్జలేనని పార్టీ నేతలూ, క్యాడర్ ముక్తకంఠంతో చెబుతున్నారు. అందుకే గతంలో జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు భగ్గుమన్న అసమ్మతి నేతలంగా సజ్జలనే నిందించారు. అలాగే ఎన్నికలలో టికెట్లు దక్కని నేతలూ సజ్జలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని భయంభయంగా తిరుగుతున్నవారు సైతం తమ ఈ పరిస్థితిని సజ్జలే కారణమని ఆయనపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేనా ఇప్పుడు సజ్జల విచారణకు హాజరు కావడానికి కారణమైన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక ఉన్నది కూడా సజ్జలేనని, ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన వారు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అందుకే ఇప్పుడు సజ్జల కూటమి ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శలను పార్టీ శ్రేణులే పట్టించుకోవడం లేదు. సజ్జలకు మద్దతుగా మాట్లాడేందుకు వైసీపీ నేతలెవరూ ముందుకు రావడం లేదు.
http://www.teluguone.com/news/content/sajjala-in-mangalagiri-police-station-39-186972.html





