గుంటూరులో మహిళపై అమానుష దాడి.. స్థానిక తెలుగుదేశం నేత సహా 9 మంది అరెస్టు.!
Publish Date:Jul 18, 2026
Advertisement
గుంటూరులో మానవత్వాన్ని మంటగలిపేలా జరిగిన ఒక అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో బోరు బావి వివాదం కారణంగా ఒక మహిళపై నడిరోడ్డుపైనే దాడికి పాల్పడిన ఘటన ఈ నెల 15న జరిగింది. బాధితురాలు తన ఇంటి ముందున్న కుళాయి నుండి మోటారు ద్వారా నీళ్లు పట్టుకుంటుండగా వివాదం మొదలైంది. స్థానిక తెలుగుదేశం పార్టీ 21వ డివిజన్ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి , అతని కుటుంబ సభ్యులు మోటార్ తొలగించాలంటూ ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆ నేత తన అనుచరులతో కలిసి మహిళపై భౌతిక దాడికి తెగబడ్డాడు. అక్కడితో ఆగకుండా.. నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. సమాజంలో ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇలాంటి అనాగరిక సంఘటనలకు తావు లేదనిపేర్కొన్నారు. నిందితులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు మల్లెల మూర్తి సహా ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మొత్తం 9 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రక్షణ ఉండదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే దారుణానికి ఒడిగట్టిన మల్లెల వెంకటరమణమూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని రకాల పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. Guntur woman assault case, CM Chandrababu Naidu reaction, TDP leader suspended Guntur, Andhra Pradesh women safety
http://www.teluguone.com/news/content/rutal-assault-on-a-woman-in-guntur-36-226378.html





