నగరి నుంచే కాదు.. చిత్తూరు జిల్లా నుంచి కూడా రోజా ఔట్!
Publish Date:Jan 28, 2024
.webp)
Advertisement
మంత్రి ఆర్కే రోజాను జగన్ చిత్తూరు జిల్లానుంచే తరిమేస్తున్నారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన నగరి అసెంబ్లీ స్థానం నుంచి మార్చేయడమే కాకుండా అసలు జిల్లాలో ఎక్కడా పోటీ చేసే అవకాశం లేకుండా ఆమెను ప్రకాశం జిల్లాకు పంపించేస్తున్నారు. రోజాను ఒంగోలు లోక్ సభ నియేజకవర్గం నుంచి రంగంలోకి దింపాలని నిర్ణయానికి వచ్చేశారు. ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. రోజా ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి దింపాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ సమాచారాన్ని స్వయంగా ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చారని కూడా అంటున్నారు.
ఈ నిర్ణయంతో జగన్ అటు చిత్తూరు నుంచి రోజాకు స్థానం లేకుండా చేయడమే కాకుండా ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయంలో తన నిర్ణయమే ఫైనల్ అని తేల్చేసినట్లు అవుతుంది.
రోజాకు ఒంగోలు లోక్ సభ స్థానం అనగానే ఇటు ప్రకారం వైసీపీలో నిరసనలు, అటు చిత్తూరు జిల్లా వైసీపీలో సంబరాలు ప్రారంభమైపోయాయి. అయితే ఈ ఒక్క మార్పు వల్ల అటు నగరి అెసెంబ్లీ స్థానం, ఇటు ఒంగోలు లోక్ సభ స్థానం వైసీపీ ఖాతాలోంచి జారిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.
సీఎం జగన్ ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంటకు ఇచ్చేది లేదని గత కొంత కాలంగా స్పష్టంగా చెబుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం ససేమిరా అంటూ వస్తున్నారు. అటు ఇప్పటికే ఒంగోలు అసెంబ్లీ స్థానం కన్ ఫర్మ్ అయిన బాలినేని కూడా లోక్ సభ స్థానం విషయంలో తన అసంతృప్తిని ఏ మాత్రం దాచుకోకుండా బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో జగన్ విజయసాయి ద్వారా ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ రోజా అని ఆ జిల్లా నేతలకు సమాచారం అందించడంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంది. తొలుత ఒంగోలు లోక్ సభ స్థానానికి జగన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నిలబెట్టాలని భావించారు. చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన భాస్కరరెడ్డిని ఒంగోలు ఎంపీ స్థానానికి, చంద్రగిరి అసెంబ్లీ స్థానాన్ని చెవిరెడ్డి కుమారుడికి అని నిర్ణయించారు. అయితే చెవిరెడ్డిని ఒంగోలు లోక్ సభ స్థానాన్ని కేటాయించడాన్ని ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతలే కాకుండా, రాజ్యసభ సభ్యుడు విజయసాయి కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు కేటాయించడమేమిటని బాలినేని గట్టిగా అభ్యంతరం చెప్పినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలా కేటాయించేటట్లైతే తన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఉన్నాడనీ, అతడికి కేటాయించాలనీ డిమాండ్ చేశారని అంటున్నారు.
మొత్తం మీద రోజాకు ఒంగోలు ఎంపీ టికెట్ దాదాపుగా కన్ ఫర్మ్ చేసిన నేపథ్యంలో బాలినేని స్పందన ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతున్నది. ఇప్పటికే బాలినేని మాగుంటతో భేటీ అయ్యారు. ఈ భేటీలో దర్శి వైసీపీ ఇన్ చార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీల సెగ్మెంట్లలో పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థులందరినీ కలుపుకుని మరో సీఎంతో భేటీ అవ్వాలని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం. మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ విషయంపై మరో సారి జగన్ ను కోరాలనీ, అప్పటికీ ఆయన వినకపోతే.. భవిష్యత్ కార్యాచరణపై ఆలోచించాలని బాలినేని ఈ సందర్భంగా ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే ఎవరి మాటా వినని సీతయ్య లాంటి జగన్ తన నిర్ణయాన్ని పునరాలోచిస్తారా అన్నది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. రోజాను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ ప్రకటన వెలువడిన తరువాత ఒంగోలు బాలినేని నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/roja-out-from-nagari-25-169489.html












