ఇండియా కూటమి ఉనికే ప్రశ్నార్థకం చేసిన నితీష్? కమలంతో కొత్త దోస్తీ!
Publish Date:Jan 27, 2024
Advertisement
ఐ.ఎన్.డి.ఐ.ఎ. కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి పేరు ఇది. ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్. విపక్షాల ఐక్యతపై ఆశలు రేపిన ఈ చుక్కల కూటమి.. ఔను నిజంగా చుక్కల కూటమే. ఎందుకంటే ఇండియా అని ఈ కూటమిని పిలుచుకోవడానికి వీలుగా ఎంతో శోధించి, శ్రమించి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సూచించిన పేరు ఇది. అయితే కూటమి ఐక్యత ఈ కూటమి ఆవిర్భావం నుంచీ ప్రశ్నార్థకంగానే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీయూ అధినేత నితీష్ కుమార్ వంటి వారి చాణక్యం కారణంగా విభేదాలను (తాత్కాలికంగా) పక్కన పెట్టి దేశంలోని ప్రధాన బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పైన చెప్పినట్లుగా అక్షరాల మధ్య చుక్కలతో ఇండియాగా కలిశాయి. ఇప్పుడు ఆ కూటమిలోని పెద్ద చుక్కలు ఒక్కటొక్కటిగా దూరం అవుతున్నాయి. తృణమూల్ అధినేత్రి పొత్తులు, కూటముల వ్యవహారం ఎన్నికల తరువాత చూసుకుందామంటూ తొలుత విపక్ష ఐక్యతకు గండి కొట్టారు. అయినా ఆమె ఎన్నికల అనంతరం పొత్తులకు, అవగాహనకు ఐక్యతకు ఆప్షన్ ను మాత్రం సజీవంగా ఉంచారు. అయితే కూటమి ముడి పడటానికి కారణమైన జేడీయూ అధినేత, బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. ఆయన కూటమి నుంచి తప్పుకోవడమే కాదు.. ఏకంగా ఎన్డీయే లో చేరిపోయేందుకు రెడీ అయిపోయారు. సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ.. కూటమికి కట్టప్ప బాహుబలికి పొడిచినట్లుగా నితీష్ చుక్కల కూటమికి వెన్నుపోటు పొడిచారు. వాస్తవానికి ఇండియా కూటమి ముడిపడటానికి పౌరోహిత్యం చేసినదే నితీష్ కుమార్. ఇందులో ఆయన స్వార్థ రాజకీయం ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ మోడీ సర్కార్ గద్దె దించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో కూటమి దిశగా బీజేపీయేతర పార్టీలను, పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ముఖ్య భూమిక నితీష్ కుమార్ దే. అందులో సందేహం లేదు.. మరాఠాయోధుడు శరద్ పవార్ కూడా ఇందుకోసం తన వంతు కృషి చేసినప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటులో మాత్రం సింహభాగం క్రెడిట్ నితీష్ కుమార్ కే దక్కుతుంది. పైగా ఇల కూటములు, పొత్తులతోనే ఆయన గత 15 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా అప్రతిహాతంగా కొనసాగగలుగుతున్నారు. పొత్తుల ఎత్తులలో ముందు చూపు ఉన్న నేతగా నితీష్ కుమార్ కు ఉన్న గుర్తింపు అత్యంత ప్రత్యేకమైనదనడంలో అనడంలో సందేహం లేదు. ఆయన దాదాపుగా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకునే రంగంలోకి దిగుతారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఎన్డీయే కూటమిలో ఉన్నారు. మధ్యలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఆర్జీడీ, కాంగ్రెస్ లతో చేయి కలిపి తన ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలంగా ఉంచుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆయన జాతీయ స్థాయిలో పొత్తులపై దృష్టి సారించారు. అందుకు కారణం పెద్ద పదవి ప్రధాని పీఠంపై దృష్టి పడటమేననడంలో రాజకీయాలతో ఏ కొద్ది పరిచయం ఉన్నవారికైనా ఇట్టే అర్ధమైపోతుంది. అందుకే ఆయన ఇండియా కూటమి ముడిపడటానికి ముందుండి పౌరోహిత్యం నెరిపారు. అయితే కాంగ్రెస్ ఉండగా ఆ పీఠం తనకు దక్కదని ఆయనకు అనతి కాలంలోనే అర్ధమైంది. ఉన్న సీఎం పీఠమైనా పదిలంగా ఉండాలంటే.. ఇండియా కూటమితో లాభం లేదనుకున్నారో ఏమో ఇప్పుడు ఆయన మళ్లీ కమలంవైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నితీష్ ఇప్పుడు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీతో తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అయిపోయారు. బీజేపీ మద్దతుతో తన పీఠాన్ని పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఇప్పుడు ఇండియా అనే చుక్కల కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే కూటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఆప్ లు దూరమయ్యాయి. ఇక ఇప్పుడు జేడీయూ సైతం అదే బాటలో ఉంది. ఉండటమేమిటి.. బీహార్ లో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోయింది.
అందుకోసం ఆర్జేడీ అంగీకరించే అవకాశం లేని ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. వచ్చే ఏడాది జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని లోక్ సభ ఎన్నికలతో కలిపి నిర్వహించేలా ముందస్తుకు వెళదామని ప్రతిపాదించారు. అందుకు ఆర్జేడీ సహజంగానే నో చెప్పేసింది. అంతే అదే కారణం చెబుతూ ఆర్జేడీకి పచ్చి కొట్టేసి బీజేపీతో జట్టు కట్టేందుకు రెడీ అయిపోయారు. గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ రద్దు, బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. తాను మాత్రం సీఎం పదవిలోనే కొనసాగేలా, అలాగే గతంలో బీజేపీకి ఇచ్చినట్లుగానే రెండు డిప్యూటీ సీఎంలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
http://www.teluguone.com/news/content/india-alliance-existence-questionable-25-169457.html





