పవన్ పై నోరు పారేసుకున్న రోజా.. జనసేన కౌంటర్ తో ముదిరిన మాటలయుద్ధం
Publish Date:Mar 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ఆరంభమైంది. ఈ సారి మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గైర్హాజర్ కావడంపై రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడిన రోజా.. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వ్యక్తిగత పనులపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపడంలేదని దుయ్యబట్టారు. మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడం, రాష్ట్రం వదలి బెంగళూరులోనూ మకాం వేసి చుట్టపు చూపుగా తాడేపల్లి ప్యాలెస్ కు రావడంపై మాత్రం రోజా ఈ మీడియా సమావేశంలో మాట్లాడలేదు. జనసేన నాయకులు ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ జగన్ బెంగళూరు మకాంపై కూడా రోజా నోరెత్తాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రానున్న రోజులలో జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/roja-lashes-out-at-pawan-kalyan-39-215460.html





