రోజా సీన్ సితారేనా?
Publish Date:Feb 1, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా.. ఆశలపై వైసీపీఅధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ నీళ్లు పోసేశారా? రానున్న ఎన్నికల్లో నగరి సీటు ఆమెకు కేటాయించేందుకు పార్టీ అధినేత సుముఖంగా లేరా అంటే వైసీపీ వర్గాల నుంచే కాదు, రాజకీయ సర్కిల్స్ నుంచి కూడా ఔననే సమాధానమే వస్తున్నది. మరోవైపు ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి ఆర్కే రోజాను రంగంలోకి దింపేందుకు ఫ్యాన్ పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోందంటూ ఓ ప్రచారం సాగినా.. అదేమీ లేదని తేలిపోయింది. దీంతో రోజాను ముచ్చటగా మూడో సారి కూడా నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం జోరందుకున్నట్లే జోరందుకుని జావగారిపోయింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు కేబినెట్ లో బెర్త్ లభించడంతో ఆమె తీరు, వైఖరి పూర్తిగా మారిపోయాయని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది. అంతే కాకుండా ఆమె పార్టీ క్యాడర్ ను, జిల్లా నేతలను కూడా పట్టించుకోకుండా, వారిని ఇసుమంతైనా లెక్క చేయకుండా వ్యవహరిస్తుండటంతో పార్టీ వర్గాల నుంచే ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో వారంతా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొరపెట్టుకున్నారు. దీంతో నియోజకవర్గంలో రోజా వ్యతిరేకులకు కీలక నామినేటెడ్ పదవులు దక్కేలా మంత్రి పెద్దిరెడ్డి జగన్ వద్ద చక్రం తిప్పారు. దీంతో ఎమ్మెల్యే, మంత్రి అయి ఉండి కూడా రోజాకు నియోజకవర్గంలో పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లేకుండా పోయింది. పైపెచ్చు ఆమెకు ఎవరితోనూ సఖ్యత లేకపోవడంతో ఆమె నియోజకవర్గంలో ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు మళ్లీ టికెట్ ఇచ్చినా విజయం సాధించే అవకాశాలు లేవన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణుల్లోనే గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోవడం, జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రి పెద్దిరెడ్డి నడుంబిగించారు. తన వర్గానికి చెందిన వారిని నగరి నుంచి బరిలో దింపేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలతో నగరి సీటు గెలవాలంటే రోజాకు టికెట్ ఇవ్వవద్దని గట్టిగా చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. నగరి నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు కోసం ఆర్కే రోజా.. తన వంతు ప్రయత్నాలు చేపట్టినప్పటికీ, ఆమెకు నియోజకవర్గంలో ప్రతి కూల పవనాలు వీస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన జగన్ ఆమెను మరో నియోజకవర్గం నుంచి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి ఆమె పేరు ప్రతిపాదించినా, కారణాలేమిటో తెలియదు కానీ, వెంటనే ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆర్కే రోజాకు అటులోక్ సభ టికెట్ కానీ ఎమ్మెల్యే సీటు కాని దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆమె సేవలను పార్టీ విజయం కోసం వాడుకోవాలనీ, పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే మాత్రం పడ్డ కష్టాన్ని ప్రతిఫలంగా రోజాకు ఏదో ఒక కీలక నామినేటేడ్ పోస్ట్ జగనన్న కట్ట బెట్టే అవకాశం ఉందనే చర్చ పార్టీలో, పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/roja-denied-nagari-ticket-25-169708.html





