రిల్స్ కోసం రిస్క్.. రోడ్డుపై స్టంట్.. చివరకు పోలీసుల పంజా..!
Publish Date:Jul 19, 2026
Advertisement
నేటి సోషల్ మీడియా యుగంలో క్షణాల్లోనే ఫేమస్ కావాలనే మోజు యువతను ప్రమాదకర మార్గాల వైపు నెడుతోంది. రీల్స్, షార్ట్ వీడియోల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్టంట్లు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు ప్రమాదాలకు గురవుతుండగా.. మరికొందరు చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నా యువతలో మాత్రం మార్పు కనిపించడం లేదు. వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ కోసం ఎంతటి రిస్క్‌కైనా వెనుకాడటం లేదు. అచ్చం ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శంషా బాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై ఓ యువతి, యువకుడు వేగంగా వెళ్తున్న కారు పైకప్పుపై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వీడియో చిత్రీకరించారు. రద్దీ రహదారిపై చేసిన ఈ స్టంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. వీడియోపై స్పందించిన ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టి, వీడియో ఆధారంగా ఇద్దరినీ గుర్తించారు. విచారణలో అనుమతులు లేకుండా కారులో మార్పులు చేసినట్లు తేలడంతో పాటు, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ప్రమాదకర డ్రైవింగ్, అనధికారిక వాహన మార్పులు తదితర నిబంధనల ఉల్లంఘనల కింద ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి స్టంట్లు, అనధికారిక వాహన మార్పులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దని పోలీసులు యువతకు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/risk-for-reels-36-226481.html





