కాల్చిపారేస్తా.. కేసీఆర్ కామెంట్స్‌పై రేవంత్ ఫైర్...
Publish Date:Feb 14, 2022
Advertisement
తగ్గేదేలే. సమస్యేలే. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేదేలే. ఇప్పటికే రెండు సార్లు నమ్మినం. కేసీఆర్ నీడను కూడా భరించం.. ఇలా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కారు, హస్తం పార్టీల మధ్య పొత్తుకు అవకాశమే లేదంటూ కాస్త ఘాటుగానే చెప్పారు. టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాలితే కాల్చి పారేయటమేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ నీడను కూడా భరించే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు రేవంత్‌రెడ్డి. గత రెండు రోజులుగా కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మరీ, ముఖ్యంగా రాహుల్‌గాంధీపై అసోం సీఎం చేసిన అసంబద్ధ కామెంట్లను గట్టిగా ఖండిస్తున్నారు. రాహుల్‌కు మద్దతుగా బీజేపీ నేతలను ఏకిపారేస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు.. అవసరమైతే ఎవరితోనైనా కలుస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను ఒక్కమాటా అనకుండా.. ఆ పార్టీకి పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. దీంతో, కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు ఉంటుందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో, నష్టనివారణ చర్యల్లో భాగంగా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి యాక్షన్‌లోకి దిగారు. కేసీఆర్, టీఆర్ఎస్‌పై మాటల తూటాలు పేల్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను నమ్మి కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు మోసపోయిందని.. తమ గొంతులో ప్రాణం ఉన్నంతవరకు టీఆర్ఎస్ ను నమ్మేది లేదన్నారు. కాంగ్రెస్.. టీఆర్ఎస్ లు ఎన్నటికి కలవవంటూ రేవంత్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు తోడు దొంగలని.. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లుగా ఆ రెండు పార్టీలు అవినీతికి పాల్పడుతూ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మరోవైపు, రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లు స్పందించకపోవటాన్ని రేవంత్ తప్పుపట్టారు. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/revanthreddy-fire-on-cm-kcr-25-131730.html





