లగచర్ల భూసేకరణ.. వెనక్కు తగ్గిన రేవంత్ సర్కార్.. ఎన్హెచ్ఆర్సీ అభిశంసన భయమే కారణమా?
Publish Date:Nov 29, 2024
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల భూసేకరణ విషయంలో వెనకడుగు వేసింది. దేశ వ్యాప్తంగా లగచర్ల భూసేకరణ వ్యవహారం సంచలనంగా మారడంతో నష్ట నివారణకు ఉపక్రమించింది. లగచర్ల భూసేకరణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణ చట్టం-2013 లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్ల భూ సేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో అభిప్రాయ సేకరణ చేసి, ప్రజాభిప్రాయం, ప్రజాభీష్టం మేరకు భూసేకరణను ఉపసం హరించు కుంటున్నట్లు పేర్కొంది. కాగా, వికారాబాద్ జిల్లా లగచర్ల భూ సేకరణ విషయంలో అభిప్రాయ సేకరణకు వెళ్లి కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడం రాష్ట వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కలెక్టర్ పై దాడి ఘటనతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. దీంతో ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాడికి పాల్పడిన 50 మందికిపైగా గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందంటూ కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అతడి ప్రధాన అనుచరుడు భోగమోని సురేష్‌లపై పోలీసులు కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా లగచర్ల బాధితులంతా కలిసి ఢిల్లీలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ మహిళా కమిషన్ ను కలిసి వారిపై పోలీసులు చేసిన దాడులు, అక్రమ అరెస్టులపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి , డీజీపీ జితేందర్ కు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా భూసేకరణపై వెనకడుగు వేయడం గమనార్హం. హక్కుల ఉల్లఘణ జరిగిందంటూ జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని అభిశంసించే ప్రమాదం ఉందన్న అనుమానంతో ప్రభుత్వం ముందుగానే వెనక్కు తగ్గి లగచర్ల భూసేకరణను ఉపసంహరించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా లగచర్ల ఘటనను డీల్ చేసే విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఈ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై పై చేయి సాధించిందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.
http://www.teluguone.com/news/content/revanth-sarkar-step-back-on-lagacharla-39-189204.html





