రేవంత్‌రెడ్డి వర్సెస్ కౌశిక్‌రెడ్డి.. తెరవెనుక అసలేం జరిగింది?
Publish Date:Jul 12, 2021
Advertisement
ఉదయం అన్ని ఛానళ్లలో కౌశిక్‌రెడ్డిదే బ్రేకింగ్ న్యూస్. తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందని.. కార్యకర్తలకు డబ్బులు ఇద్దామని.. అందరినీ జమ చేయమంటూ ఓ గులాబీ లీడర్‌తో కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. ఇక అప్పటి నుంచీ తెలంగాణవ్యాప్తంగా కౌశిక్‌రెడ్డి గురించే రాజకీయ చర్చ. ఇలా న్యూస్ వచ్చిందో లేదో.. అలా రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. అటు, కాంగ్రెస్‌లో ఇంటిదొంగలను వదిలేది లేదంటూ పరోక్షంగా కౌశిక్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. ఇలా రెండువైపుల నుంచి ఉచ్చు బిగియడంతో.. ఇక వేటు తప్పదని గ్రహించి.. చేసేది లేక.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కౌశిక్‌రెడ్డి. ఉదయం టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అంటూ ఫోన్ కాల్.. అది లీక్ కావడం.. కాంగ్రెస్ నుంచి వార్నింగ్ రావడంతో.. సాయంత్రంకల్లా పార్టీకి రాజీనామా. ఇదీ కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌లో హైడ్రామా. వెళ్తూ వెళ్తూ అందరూ చేసేదే ఆయనా చేశారు. రేవంత్‌రెడ్డిని బద్నామ్ చేసేలా.. బాగానే ఆరోపణలు గుప్పించారు. 50కోట్లకు పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారని.. సీనియర్లు సంతోషంగా లేరని.. ఈటల కోవర్ట్ అని.. రేవంత్ ముమైత్‌ఖాన్ లాంటోడని.. పోటీకి ముందే చేతులెత్తేశారని.. తనను కాదని పొన్నం ప్రభాకర్‌కు టికెట్ ఇచ్చేందుకు కుట్ర చేశారని.. దమ్ముంటే హుజురాబాద్‌లో గెలవాలంటూ సవాల్ చేసి మరీ పార్టీ వీడారు కౌశిక్‌రెడ్డి. రొటీన్‌గా కార్యకర్తలతో చర్చించి రెండుమూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. కౌశిక్‌రెడ్డి కొంతకాలంగా టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. ఇటీవల కేటీఆర్‌తో ఆయన చేసిన చిట్‌చాట్ పార్టీకి ఆగ్రహం తెప్పించింది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కౌశిక్‌రెడ్డికి టికెట్ రాదని.. హుజురాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను బరిలో దింపుతారనే ప్రచారం జరిగింది. ఒకవేళ కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి.. ఆయన్ను గెలిపించుకున్నా కూడా.. గెలిచాక టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందనేది కాంగ్రెస్ అనుమానం. అందుకే, ఆయన కమిట్‌మెంట్‌పై నమ్మకం లేక.. కౌశిక్‌రెడ్డి స్థానంలో పొన్నంను నిలబెట్టాలనేది రేవంత్‌రెడ్డి ఆలోచన అంటున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ స్థానం ఏళ్లుగా ఈటల ఇలాఖా అని.. అక్కడి గెలుపు ఓటమిలు కాంగ్రెస్‌పై కానీ, తనపై కానీ పెద్దగా ప్రభావం చూపదని రేవంత్ మాట్లాడటం కాకరేపింది. అదే పాయింట్ మీద తాను పార్టీ వీడుతున్నానంటూ.. ఎన్నికలకు ముందే రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని ఆరోపిస్తూ.. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అయితే, ఇన్ని ఆరోపణలు చేసిన కౌశిక్‌రెడ్డి.. తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందంటూ మాట్లాడిన ఫోన్ కాల్‌పై స్పందించడానికి మాత్రం నిరాకరించడం విచిత్రం. అంటే, ముందే కారు పార్టీ టికెట్ కన్ఫామ్ చేసుకొని.. అది కాస్త లీక్ కావడంతో.. రేవంత్‌రెడ్డి మీద బట్ట కాల్చి మీదేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. అటు, రేవంత్‌రెడ్డి సైతం పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్‌లైన్ విధించారు. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి వెనుక మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉందనే అనుమానం ఒకవైపు.. రేవంత్‌రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికే టీఆర్ఎస్ డైరెక్షన్‌లో కౌశిక్‌రెడ్డి ఇలా పొలిటికల్ డైలాగులు పేల్చారనే ప్రచారం మరోవైపు. ఏదిఏమైనా.. కేవలం హుజురాబాద్‌కు మాత్రమే పరిమితమైన కౌశిక్‌రెడ్డి.. యావత్ తెలంగాణకే పీసీసీ చీఫ్ అయిన బలమైన లీడర్‌ను విమర్శిస్తే.. రేవంత్‌రెడ్డికి పోయేదేముంటుంది? ఇక, ఇటీవలే రేవంత్‌రెడ్డిని కలిసి, పూలబొకే ఇచ్చి, ఫోటో దిగిన కౌశిక్‌రెడ్డి.. వారం రోజుల్లోనే అదే రేవంత్‌రెడ్డిని నానామాటలు అంటూ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం ఆసక్తికరం. అందుకే అంటారు.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని....
http://www.teluguone.com/news/content/reasons-behind-revanth-reddy-vs-koushik-reddy-25-119422.html





