ప్రగతిభవన్ వీడి.. సొంతింటికి కేసీఆర్.. ఏదో జరగబోతోందా?
Publish Date:Jul 12, 2021
Advertisement
ఊరక రారు మహానుభావులు. అందులోనూ కేసీఆర్‌లాంటి మాయలమరాఠీలైతే రాజకీయ ప్రయోజనం లేనిదే అసలేపనీ చేయరు. ఆకస్మాత్తుగా ఆసుపత్రుల సందర్శన ఎందుకు చేశారో.. సడెన్‌గా జిల్లాల పర్యటన ఎందుకు చేస్తున్నారో.. మళ్లీ ప్రజల్లోకి ఎందుకు వస్తున్నారో.. దళితులకు ప్రత్యేక పథకాలు ఎందుకు ప్రారంభిస్తున్నారో.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల దూకుడు ఎందుకు పెంచారో.. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎందుకు అంటున్నారో.. ఎవరైనా ఇట్టే ఊహించగలరు. తాజాగా, సీఎం కేసీఆర్ చేసిన మరోపని వీటన్నిటికంటే మరింత వెరీ వెరీ స్పెషల్.. అసలెవరూ ఊహించనిది.. ఏడేళ్లుగా ఆయనకు సైతం అస్సలు గుర్తుకురానిది.. అందుకే, ఆ విషయంపై ఇప్పుడు పొలిటికల్ ఇంపార్టెన్స్ అమాంతం పెరిగింది.. దాని వెనకాలే అనేక రాజకీయ విశ్లేషణలూ మొదలయ్యాయి.. ఇంతకీ అదేంటంటే... సీఎం కేసీఆర్ చాలా ఏళ్ల తర్వాత తన సొంతింటికి వెళ్లడం.... సీఎం కేసీఆర్.. ఉండేది ప్రగతిభవన్‌లో.. రాజకీయ వ్యూహాలు పన్నేది గజ్వేల్‌లోని ఫామ్‌హౌజ్‌లో. ఏడేళ్లుగా ఈ రెండు లొకేషన్లే కేసీఆర్‌కు కేరాఫ్ అడ్రస్. అయితే, ఆయనకు హైదరాబాద్‌లోనే ఓ సొంతిళ్లు ఉందనేది చాలామందికి తెలిసిందే అయినా.. కేసీఆర్‌తో సహా అంతా ఆ విషయం ఎప్పుడో మర్చిపోయారు. ఉద్యమానికి ముందు.. ఉద్యమ సమయంలో.. ఆయన నివాసమంతా నందినగర్‌లోని సొంతింటిలోనే. ఆ నందినగర్ ఇంటి నుంచే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. స్వరాష్ట్ర స్వప్నం సాధించుకున్నారు. సీఎం కాగానే.. నందినగర్ ఇంటిని వదిలేసి.. ప్రగతిభవన్‌లో సెటిల్ అయిపోయారు. ఫామ్‌హౌజ్‌లో సేద తీరుతున్నారు. అలాంటి కేసీఆర్.. సడెన్‌గా నందినగర్‌లోని ఆయన సొంతింటికి వచ్చారు. ఆ ఇంటికి మార్పుచేర్పులు చేయిస్తున్నారు. ఆ పనులను స్వయంగా పరిశీలించారు సీఎం కేసీఆర్. ఇదే ఇప్పుడు పొలిటికల్‌గా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంతకీ, కేసీఆర్ నందినగర్ ఇంటికి ఎందుకు వెళ్లినట్టు? ఆ ఇంటికి ఎందుకు మరమ్మత్తులు చేయిస్తున్నట్టు? త్వరలోనే కేసీఆర్ అడ్రస్ మారిపోబోతోందా? ప్రగతిభవన్ వీడి నందినగర్‌కు సిఫ్ట్ అవుతారా? అయితే, ఎందుకు అవుతారు? ప్రగతి భవన్‌ను ఎందుకు వదిలేస్తారు? నందినగర్‌లోని సొంతింటిపై మళ్లీ ఎందుకు మమకారం పెరిగింది? ఇలా పలు ప్రశ్నలు.. వాటిపై ఆసక్తికర విశ్లేషణలు... రెండుమూడు వర్షన్‌లు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌ను త్వరలో సీఎంను చేయబోతున్నారని.. హుజురాబాద్ ఎలక్షన్స్ తర్వాత అందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని అంటున్నారు. కేటీఆర్‌కు పాలనా పగ్గాలు అప్పగించి.. తానిక ఫుల్‌టైమ్ పాలిటిక్స్‌పై ఫోకస్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం.. అటు ఈటల, బండి సంజయ్‌లతో బీజేపీ దూకుడు.. మధ్యలో షర్మిల చిటపటలు.. తెలంగాణలో వేగంగా పడిపోతున్న కేసీఆర్ గ్రాఫ్.. ప్రజల్లో ప్రబలిపోతున్న అసంతృప్తి.. నిరుద్యోగుల కడుపుమంట.. దళితుల మనోవేదన.. ఇలా అన్నివర్గాల ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక జ్వాలల నుంచి గట్టెక్కడానికి.. తనపై ఉన్న ప్రభుత్వ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించి.. తానిక పార్టీ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ల రూపంలో అది వెనకెనక్కి పోతుండటంతో కేసీఆర్ ఈసారి మరింత పట్టుదలతో ఉన్నారట. కేటీఆర్‌ను సీఎం చేసి.. తానకు కలిసొచ్చిన నందినగర్‌లోని సొంతింటికి షిఫ్ట్ అయి.. మరోసారి ఉద్యమ సమయంలో మాదిరి రాజకీయ పావులు కదపాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు.. ప్రగతిభవన్, ఫామ్‌హౌజ్‌ల పేరు చెప్పి.. తనను ప్రతిపక్షాలు పదే పదే టార్గెట్ చేస్తుండటంతో.. ఆ మరక కడిగేసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈటల రాజేందర్ అది ప్రగతిభవన్ కాదు బానిస భవన్ అంటూ పేల్చిన డైలాగ్ జనాల్లో బాగా నాటుకుపోయింది. ఆ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానంటూ సవాల్ కూడా చేశారు. ఇక రేవంత్‌రెడ్డి సైతం అది ప్రగతిభవన్ కాదు దొరల గడి అంటూ విమర్శలు చేస్తుండటం.. ఫామ్‌హౌజ్‌లో పడుకునే సీఎం అంటూ తనను జనాల్లో దోషిగా నిలబెడుతుండటంతో.. ఇక తన అడ్రస్ మార్చే టైమ్ వచ్చిందని కేసీఆర్ అనుకుంటున్నారట. అందుకే, నందినగర్‌లోని తన సొంతింటికి త్వరలోనే షిఫ్ట్ అవుతారని.. అందుకే ఆ ఇంటికి మరమ్మత్తులు చేయిస్తున్నారని.. ఆ పనులను ఆయనే స్వయంగా పరిశీలించారంటూ.. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజమో తెలీదు గానీ.. ఏడేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ తన సొంతింటిపై ఫోకస్ చేయడం చూస్తుంటే.. రాజకీయంగా, పాలనాపరంగా త్వరలోనే కీలక పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/cm-kcr-visit-nandi-nagar-his-own-house-25-119426.html





