మార్వాడీ గో బ్యాక్.. మతలబ్ క్యా హై?
Publish Date:Aug 18, 2025
Advertisement
మీరు మార్వాడీ గో బ్యాక్ అంటే, మేం అంబేద్కర్ గో బ్యాక్ అంటాం. మీరు ఇక్కడున్న నార్త్ వారిని తరిమేస్తామంటే.. మేం ఉత్తరాదికి చెందిన రాముడ్నే వద్దంటాం. ఇదీ ప్రస్తుతం తెలంగాణాలో నడుస్తోన్న గొడవ. ఇదెంత వరకూ సమంజసం? ఎవరిదంతా చేస్తున్నారు? అసలీ గొడవకు మూలకారణమేదని చూస్తే.. మార్వాడీలు వస్తే పాతుకు పోతారని.. కోటాను కోట్ల రూపాయలు వెనకేస్తారని కొందరు స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వీరిక్కడి నుంచి వెళ్లి పోవల్సిందేనని ఉద్యమిస్తున్నారు. డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్ల కారణంగా సాదా సీదా కిరాణా కొట్లు ఆగం అవుతున్నాయని, ఆయా వ్యాపారులు నష్టాల పాలవుతున్నారని అంటున్నారు. దానికి తోడు ఎద్దుల బండి వెళ్లలేని చోటుకు కూడా ఈ మార్వాడీలు ప్రవేశించి అక్కడ చిన్న కొట్టు తెరిచి తిష్ట వేస్తూ భారీ ఎత్తున సంపాదిస్తున్నారనీ అంటున్నారు. బేసిగ్గా వీళ్లతో వచ్చే తంటా ఏంటంటే వీళ్లు కిరాణా కొట్టు తెరిచినా, తనఖా కొట్టు తెరిచినా.. నిఖార్సుగా ఉంటారు. రూపాయి అటు ఇటు పోనివ్వరు. ఎవరికీ పెద్దగా అప్పులు ఇవ్వరు. వీళ్లకు పెద్దగా సెంటిమెంట్లు కూడా ఉండవని అంటారు. దీంతో ఎదుటి వారి సమస్య వీరికసలు ఏ మాత్రం సమస్య కాదని అంటారు. దీంతో వీరు భారీ ఎత్తున లాభార్జన చేస్తారని చెబుతారు. అదే స్థానిక వ్యాపారులు ఏదైనా షాపు తెరిస్తే, వాళ్లకు ఇక్కడున్న పరిచయాల కారణంగా అప్పులు ఇవ్వడం, కాస్త ఉదారంగా వ్యవహరించడం జరుగుతుంది. అదే మార్వాడీలతో అలాక్కాదు. వీరు లెక్కంటే లెక్కే. అప్పు అస్సలు ఇవ్వరు దీంతో వీరికొచ్చిన లాభాలు మరెవరికీ రావు. అయితే ఇక్కడే తెలుగు వాళ్లలో చాలా మంది ముంబై, సూరత్, నాగ్ పూర్ వంటి వంటి ప్రాంతాలకు వలస వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించడం లేదా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. అయితే మార్వాడీలకీ, తెలుగు వాళ్లకీ చాలానే తేడాలుంటాయని అంటారు. తెలుగు వాళ్లు బతకడానికి నాలుగు రూకలు సంపాదించుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటారు. అదే మార్వాడీలు అలా కాదు.. ఇక్కడ వాళ్లు చిన్న జిలేబీ, సమోసా బండి పెట్టినా ఊళ్లో ఇళ్లు, వాకిళ్లు కట్టడంతో పాటు ఇక్కడ కూడా కాంప్లెక్సులు లేపుతారనే పేరుంది. దీనికి తోడు ఇటీవల హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్లో పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో మార్వాడీలపై ఎప్పటి నుంచో గూడుకట్టుకున్న వ్యతిరేకత ఒక్కసారిగా భగ్గుమంది. దళిత సంఘాలు, కొందరు యువకులు మార్వాడీ గో బ్యాక్ అంటూ ఉద్యమిస్తున్నారు. దీంతో మార్వాడీల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తూ కొందరు ఈ మూమెంట్ తీసుకువస్తున్నారు. సోమవారం (ఆగస్టు 18) ఆమనగల్ బంద్కు కొందరు పిలుపు నిచ్చారు…మరి చూడాలి ఇది ఏ తీరాలకు చేరనుందో? ఇందులో మరెలాంటి గొడవలు రానున్నాయో అయితే ఇప్పటి వరకూ వీరి తరఫున బీజేపీ మాత్రమే వాయిస్ వినిపిస్తున్నది. మిగిలిన పార్టీలేవీ రియాక్ట్ కాలేదు.
http://www.teluguone.com/news/content/reason-behind-marwadi-go-back-slogun-39-204447.html





