జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా ఎందుకు చేశారంటే?
Publish Date:Apr 11, 2026
Advertisement
జస్టిస్ యశ్వంత్ వర్మ అసలు రాజీనామా ఎందుకు చేసినట్టు? ఆయన విషయంలో అసలేం జరిగింది? ఆయన చుట్టూ అల్లుకున్న నోట్ల వివాదమేంటి? అని చూస్తే.. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా ప్రస్తుతం భారత న్యాయ వ్యవస్థలో పెను సంచలనం సృష్టించింది. ఆయన రాజీనామా వెనుక ఉన్న ప్రధాన కారణం.. కాలిన నోట్ల కట్టల వివాదం. పర్యవసానంగా జరుగుతున్న అభిశంసన ప్రక్రియ. అందుకే ఇప్పుడు ఆయన రాజీనామా హాట్ టాపిగ్గా మారింది. 2025, మార్చి 14న.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన తన నివాసంలో లేరు. మంటలను ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బందికి స్టోర్ రూమ్‌లో భారీ ఎత్తున కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ మొత్తం కోట్లాది రూపాయల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆ నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఎవరో అక్కడ పెట్టారని జస్టిస్ వర్మ మొదటి నుంచీ ఖండిస్తూ వచ్చారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు. పార్లమెంటులో అభిశంసన తీర్మానం నెగ్గితే, ఆయన అవమానకర రీతిలో పదవిని కోల్పోవాల్సి వస్తుంది. అంతే కాకుండా, పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్, ఇతర ప్రయోజనాలు కూడా రద్దవుతాయి. విచారణ కమిటీ తన వాదనలను వినిపించడానికి ఏప్రిల్ 10 నుండి సమయం ఇచ్చింది. కానీ దానికి ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 9, 2026న ఆయన రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు. ఆయన తన లేఖలో తీవ్రమైన మనస్తాపం వ్యక్తం చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరించి రాష్ట్రపతి కార్యాలయానికి భారం కలిగించడం ఇష్టం లేదని పేర్కొన్నారు. అయితే, తనపై జరిగిన విచారణ అంతా అన్యాయంగా సాగిందని, భవిష్యత్తులో చరిత్రే దీనికి సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. సాధారణంగా న్యాయమూర్తులు రాజీనామా చేయడం అరుదు. గతంలో జస్టిస్ వి.రామస్వామి, జస్టిస్ సౌమిత్ర సేన్ వంటి వారు కూడా ఇలాగే అభిశంసనను ఎదుర్కొంటున్న తరుణంలో రాజీనామా చేశారు. జస్టిస్ వర్మ కూడా అదే బాటలో నడిచారు. వర్మ రాజీనామాతో పార్లమెంటులో జరుగుతున్న అభిశంసన ప్రక్రియ ఇప్పుడు నిలిచిపోతుంది. ఆయన సాధారణ పదవీ విరమణ పొందినట్లుగానే పరిగణించబడతారు, తద్వారా ఆయనకు పెన్షన్ సౌకర్యం లభించే అవకాశం ఉంది. అందుకే ఆయనిలా చేసినట్టుగా భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/reason-behind-justice-yashwanth-verma-36-217165.html





