బాలినేని ఒంగోలు ఎంట్రీ.. కారణమేంటంటే?
Publish Date:Jul 15, 2024
Advertisement
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీ నేతల మధ్య వర్గవిబేధాలు బయటకొస్తున్నాయి. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాల కారణంగానే తాము ఓడిపోయామని కొందరు వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతుండగా.. మరికొందరు క్యాడర్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘోర ఓటమితో మరికొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరిలో చాలా మంది వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరు. బాలినేని వైసీపీని వీడబోతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చ జరిగింది. ఇందుకు కారణం.. ఎన్నికల ఫలితాల రోజునుంచి ఆయన జిల్లాకు, పార్టీ క్యాడర్‌కు దూరంగా ఉన్నారు. తాజాగా.. ఒంగోలుకు వచ్చిన బాలినేని తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. నేను ఏ పార్టీలో చేరడం లేదు.. వైసీపీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. వైసీపీని వీడనని బాలినేని కరాఖండీగా చెప్పినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం విశ్వసించడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి పరాజయం పాలయ్యరు. తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌రావు. 34వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యతతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం బాలినేని రాజకీయంగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షల్లోనూ బాలినేని కనిపించలేదు. 2014 ఎన్నికల సమయంలోనూ బాలినేని ఇలానే వ్యవహరించారు. ఆ సమయంలో ఓటమి తరువాత దాదాపు మూడునాలుగేళ్ల పాటు క్యాడర్ కు అందుబాటులో లేరు. ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు ఒకసారి పార్టీ కర్యక్రమాల్లో కనిపించేవారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బాలినేని ఘోర ఓటమిని చవిచూశాడు. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారంసైతం జరిగింది. తాజాగా ఒంగోలు వచ్చిన బాలినేని ఈ విషయంపై స్పందించారు. కౌంటింగ్ రోజున ఎన్నికల మూడ్ చూసి బాధవేసి ఒంగోలును విడిచి వెళ్లిపోయానన్నారు. ఒకానొక దశలో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచించిన మాట వాస్తవమే. కానీ, అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు దాడులు మొదలుపెట్టారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు మళ్లీ ఒంగోలులో అడుగు పెట్టానని బాలినేని చెప్పారు. ఎన్నికల ఫలితాల తరువాత నుంచి నియోజకవర్గం వైపు చూడని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్లుండి ఒంగోలులో అడుగు పెట్టడం వెనుక ఓ కారణం ఉందని ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వైసీపీ ఘోర ఓటమి తరువాత బాలినేని ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. కూటమి పార్టీల్లో ఏదోఒక పార్టీలో చేరాలని ఆయా పార్టీల ముఖ్యనేతలతో మంతనాలు సైతం జరిపినట్లు తెలిసింది. అయితే, మూడు పార్టీల అధిష్టానాల నుంచి బాలినేనికి గ్రీన్ సిగ్నల్ లభించకపోవటంతో ఆయన అనివార్యంగా వైసీపీలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన మళ్లీ ఒంగోలుకు వచ్చినట్లు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అంతే కాక ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించేందుకు జగన్ మోహన్ రెడ్డి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డికి ఇచ్చే విషయంపై జగన్ నిర్ణయాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికే మరోసారి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాగుంటకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించి.. చెవిరెడ్డిని రంగంలోకి దింపారు. దీంతో మాగుంట తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చెవిరెడ్డిపై విజయం సాధించారు. ప్రకాశం జిల్లా వైసీపీలో ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు ఎవరనే విషయంపై చర్చ జరుగుతుంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు జగన్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జంకె వెకంటరెడ్డి పనితీరు అంతంత మాత్రంగా ఉండటం.. ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు వేరేవారికి అప్పగించేందుకు పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. చెవిరెడ్డికే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని వైసీపీ నేతలు సైతం భావిస్తున్నారు. మొదటి నుంచి జిల్లాలో చెవిరెడ్డి ఎంట్రీని బాలినేని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. చెవిరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాలినేని, ఆయన అనుచరులు వైసీపీని వీడటం ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించి బాలినేనికి జగన్ షాకివ్వబోతున్నారా.. లేకుంటే.. బాలినేని సూచించిన వారికి జిల్లా పగ్గాలు అప్పగిస్తారా అనే అంశం వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపుతోంది.
http://www.teluguone.com/news/content/reason-balineni-enter-ongole-25-180814.html





