రఘురామ ఒంటిపై గాయాలు!.. పోలీసులు కొట్టారంటూ జడ్జికి ఫిర్యాదు..
Publish Date:May 15, 2021
Advertisement
ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో హైడ్రామా నడుస్తోంది. పోలీసులు తనను కొట్టారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు జడ్జికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. తనను సీఐడీ పోలీసులు కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు. ఈ మేరకు జడ్జికి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. మరోవైపు లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని రఘురామ తరఫు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లాయర్ గోపినాథ్ అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలున్నాయని ఆయన తెలిపారు. కోర్టులోకి న్యాయవాదులను వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. హైకోర్టు సూచన మేరకు ఆయన్ను గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టును జడ్జికి అందజేశారు. రఘురామపై సీఐడీ అధికారులు పెట్టిన సెక్షన్లు వర్తించవని, రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆ సెక్షన్లను రద్దుచేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించారు. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు సీఐడీ కోర్టులో బెయిల్ పిటిషన్‌తో పాటు అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. తనను పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారని, రాత్రి వేధింపులకు గురిచేశారంటూ రఘురామకృష్ణరాజు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదును న్యాయమూర్తికి అందజేశారు.
http://www.teluguone.com/news/content/raghurama-krishnaraju-case-in-cid-court-39-115532.html





