ఆప్ వదిలేస్తే.. సీఎం పదవి.. సిసోడియాకు బంపరాఫర్!
Publish Date:Oct 18, 2022
Advertisement
భయపెట్టడంలో బీజేపీ కొత్త పంథాను అనుసరిస్తోంది. తమ ఆపరేషన్ లోటస్ ను విజయవంతంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద నాయకులను నయానో భయానో లాగేసుకోవడానికి కమలం గూటికి లాగేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తోంది. భయపెడుతోంది, బుజ్జగిస్తోంది, ప్రలోభపెడుతోంది, చివరకు సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. సామ, దాన,భేద, దండోపాయలను ఉపయోగిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విషయంలోనూ అదే చేసింది. ఆ విషయాన్ని మనీష్ సిసోడియాయే స్వయంగా వెల్లడించారు. ఆయన్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సోమవారం ఏకంగా పది గంటల పాటు సిబీఐ ప్రశ్నించింది. చిత్రమేమంటే వారి ప్రశ్నల పరంపర ముగిసి బయటికి రాగానే సిసోడియాకి ఆగ్రహం కంటే నవ్వే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన వెంటనే అసలీ లిక్కర్ కుంభకోణం అంతా పేద్ద ఫేక్ అని ఆరోపించారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న తొండి ఆట. కేవలం వారి ఆపరేషన్ లోటస్ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. సిసోడియా ఉదయం 11.15 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకుని దాదాపు 10 గంటల విచారణ అనంతరం రాత్రి 8.40 గంటలకు బయటకు వచ్చారు. లిక్కర్ కుంభకోణం విషయంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సిబిఐ, ఈడీ దాడులు, సోదాలూ ముమ్మరం చేశాయి. ఏదో దేశద్రోహం జరిగిపోయిందన్నంత సీన్ క్రియేట్ చేశాయి. చాలామంది మీద నిఘా పెట్టాయి. ఏకంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎం.పీ కవిత మీద భారీ ఆరోపణలు వచ్చాయి. ఆమెను అరెస్టు చేయవచ్చన్న వార్తలు దేశమంతా విస్తరించాయి. సిబిఐ సోదాలు, ఈడీ దాడులు అన్నీ కూడా బీజేపీ తమ రాజకీయ పరపతి పెంచుకోవడానికి ఉపయోగించిన రాజకీయ అస్త్రాలని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. సిసోడియాను సోమవారం కంగారెత్తించేంతగా ప్రశ్నించి ఆఖరికి మీరు మీ పార్టీని వదులుకోవాలని అని అడిగారట. దీన్ని సిబిఐ విచారణలో భాగమని ఎలా ఎవరయినా అనుకుంటారు. వాళ్లింటికి వెళ్ల కండి, వాళ్లతో తిరక్కండి, మాతో ఉంటే మీకు అన్ని వసతులు చూస్తామనే బెదిరింపు ప్రేమ సందేశం ఈ విధంగా బీజేపీ ఇచ్చిం దా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ నేను ఆప్‌ని వదిలే ప్రసక్తి లేదని చెప్పానని, బీజేపీ కోసం నన్ను సీఎం చేస్తామన్నారని సిసోడియా మీడియాకు చెప్పారు. సిబిఐగాని, ఈడీగానీ సర్వస్వతంత్ర వ్యవస్థలు అన్నపుడు వారి ప్రశ్నావళిలో రాజకీయ పదవులు మార్పులు గురించి ఎలా ఉంటుంది? సిసోడియా గనుక పార్టీ మారితే ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తారుట అనే సందేశం ఆ అధికారుల నోటి వెంట ఎలా వస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ బీజేపీనే సిద్ధపరిచిందనేది మనీష్ సిసోడియా ఆరోపణ. పార్టీలోకి సాదరంగానే పిలవచ్చు, పార్టీ కీలక వ్యక్తే ఆయన్ను తమ పార్టీలోకి చేరడానికి బేరసారాలు మాట్లాడుకునే రోజుల్లో ఆయన్ను సీబీఐ ద్వారా అడిగించడంలో అర్ధం బెదిరించడమే అవుతుంది. అయితే సిసోడియా ఆరోపణలను దర్యాప్తు సంస్థ ఖండించింది. ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌తో సహా ఇతర నిందితులతో ఆయనకున్న సంబంధాలు, ఈ కేసులో సోదాల సమయంలో లభించిన పత్రాలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం పలు అంశాలపై విచారించామని అధికారులు తెలిపారు. ఈ కేసులో వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించింది.
http://www.teluguone.com/news/content/quit-aap-will-make-you-cm-bumper-offer-to-manishsisodia-25-145625.html





