ఇప్పుడిక జనసైనికుల వంతు.. జాగ్రత్త.. రఘురామకృష్ణం రాజు
Publish Date:Oct 18, 2022
Advertisement
ప్రశ్నించినా, ఎదిరించినా తమ పార్టీ అధినేత జగన్ సహించలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. అందుకూ విశాఖ భూ బకాసరుల బండారం బయటపడుతుందన్న భయంతోనే జనసేన అధినేత విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం తప్పదాలను ఎత్తి చూపినందుకే గతంలో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని అన్నారు. నిన్నటి వరకూ తెలుగుదేశం కార్యకర్తలను సీఐడీ పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లి చితక బాదుతున్నారని, ఇప్పుడు ఆ వంతు జనసైనికులకు వచ్చిందని రఘురామరాజు అన్నారు. వారు ఒకింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ తన సూచనను తేలిగ్గా తీసుకోవద్దని ఆయన జనసేనను కోరారు. వాతావరణ కేంద్రం తుపాను హెచ్చరిక ఎలా జారీ చేస్తుందో.. అలా తాను ఈ సీఐడీ దాడుల హెచ్చరిక జారీ చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందన్న రఘురామకృష్ణం రాజు తెలుగుదేశం, జనసేన, రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలూ రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రం, రాష్ట్రపతిలకు వివరించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరాలని సూచించారు. విశాఖ గర్జన్ పేరుతో విశాఖను రెండు రోజుల పాటు పోలీసు వలయంలో దిగ్బంధనం చేసి..విశాఖ వాసులకు ప్రభుత్వం నరకం చూపిందన్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద పోలీసులే విధ్వంసం సృష్టించి జనసైనికులు, ప్రజలను తరిమి కొట్టారని రఘురామ ఆరోపించారు. విశాఖలో పోలీస్ యాక్ట్ అమలులో ఉందని చెబుతున్న పోలీసులు విశాఖ గర్జనను ఎలా జరగనిచ్చారని ఆయన ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/now-it-is-janasenas-caders-turn-25-145622.html





