పట్టాదార్ పాసుపుస్తకాలపై క్యూఆర్ కోడ్.. 2027నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ!
Publish Date:Apr 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల యాజమాన్య హక్కులపై నమ్మకాన్ని పెంచేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. నంద్యాల జిల్లా ధోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో జరిగిన మీ భూమి - మీ హక్కు'కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రైతులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని, క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులకు ఈ పట్టాదార్ పాసుపుస్తకాల ద్వారా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ హయాంలో భూ రికార్డుల విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేశారు. మునుపటి ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు శాపంగా మారిందన్న ఆయన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశామన్నారు. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది రైతులకు ఆత్మగౌరవంతో కూడిన సెంటిమెంట్ అన్నారు. కొత్తగా రూపొందించిన పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించినట్లు చంద్రబాబు వెల్లడిం చారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాపులు వెనువెంటనే ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్‌కు ఇసుమంతైనా అవకాశం ఉండదన్నారు. ఒకసారి బ్లాక్ చైన్ సిస్టమ్‌లోకి డేటా వెళ్ళాక, ఉన్నతాధికారులు సైతం యజమాని అనుమతి లేకుండా మార్పులు చేయలేరని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాలపై అధికారిక రాజముద్ర మాత్రమే ఉంటుందన్నారు. ఈ పాసు పుస్తకాలను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16,816 గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు చాలా గ్రామాల్లో గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందన్న చంద్రబాబు.. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు.
http://www.teluguone.com/news/content/qr-codes-on-pattadar-passbooks-36-217019.html





