మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలపై ప్రజాగ్రహం ఎందుకంటే?
Publish Date:Jul 25, 2026
Advertisement
దేశ రాజధాని హస్తిన వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న జెన్ జెడ్ ఉద్యమ కవరేజ్ సందర్భంగా పలు ప్రధాన స్రవంతి మీడియా ప్రతినిధుల తీరు ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటోంది. ఇప్పటికే ఆ ప్రజాగ్రహ జ్వాలల సెగ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతినిధులకు సోకింది కూడా. అందుకు కారణమేంటంటే.. మెయిన్ స్ట్రీమ్ మీడియా.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఏకపక్ష వార్తలు ప్రసారం చేస్తున్నాయని జనం భావించడమే. ఆ ఆగ్రహంతోనే ఉద్యమకారులు జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సందర్భంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల ప్రతినిధులపై అంటే ఆయా సంస్థలలో పని చేసే జర్నలిస్టులపై దాడులకు కూడా పాల్పడ్డారు. అటువంటి సంఘటనల్లో కొందరు విలేకరులు గాయపడ్డారు. ఇక సోషల్ మీడియాలో అయితే అటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలపైనా, ఆయా సంస్థల విలేకరులపైనే ఓ రేంజ్ లో ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. నెటిజనులు ఆయా మీడియా సంస్థల ప్రతినిధులను బదరిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. జులై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనను కవర్ చేసేందుకు వెళ్లిన టైమ్స్ నౌ విలేకరి పై కొందరు దౌర్జన్యానికి దిగారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. నీళ్ల సీసాలు విసిరారు. కాలితో తన్నారు. ప్రదర్శనకారుల ఆగ్రహానికి ఆయన అక్కడ నుంచి వెళ్లిపోక తప్పలేదు. అలాగే.. పార్లమెంట్ దిశగా సాగిన విద్యార్థుల ప్రదర్శనపై పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, అయితే.. టైమ్స్ నౌ కవరేజీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనీ, పోలీసుల దౌర్జన్యాలను హైలైట్ చేయలేదన్నది నిరసన కారుల ఆరోపణ. అందుకే ఆ మీడియా సంస్థ ప్రతినిథిపై దాడి జరిగిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అలాగే రిపబ్లిక్ టీవీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ కూడా నిరసనకారుల ఆగ్రహాగ్నిని చవిచూశారు. మీడియా సంస్థలు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై నిరసనకారుల ఆగ్రహానికి ఇవి నిదర్శనలుగా పరిశీలకులు చెబుతున్నారు. ఆ రెండు మీడియా సంస్థలే కాదు, ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుస రిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు. మోడీ అనుకూల వైఖరితో ప్రసారాలు, ప్రచురణలు చేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలను నెటిజనులు గోడీ మీడియాగా సంబోధిస్తూ నెటిజనులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా సంస్థలు తమ వార్తా ప్రసారాలు, ప్రచురణల్లో నిష్పాక్షికతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే.. ప్రజాగ్రహానికి గురి కావలసివస్తుందన్న విషయం తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషించాల్సిన ఫోర్త్ ఎస్టేట్ మీడియా ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకోకుండా, ఇక నుంచైనా నిష్పాక్షితకు, వాస్తవాల ప్రసార, ప్రచురణలకు ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే గోడీ మీడియాపై ప్రజా వ్యతిరేకత మరింత పెచ్చరిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. Jantar Mantar protests, Attacks on Journalists, Partiality, News Coverage
http://www.teluguone.com/news/content/public-anger-against-mainstream-media-organizations-25-227058.html





