అనుచిత వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం!
Publish Date:Jun 20, 2022
Advertisement
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది. అంతే కానీ, బాధ్యతలను మరిచి నోరు జారితే, అందుకు మూల్యం చెల్లించక తప్పదు. ఇదేదో, చట్టబద్దమైన హెచ్చరికలా అనిపించినా, కాదు. నడుస్తున చరిత్ర చెపుతున్న నిజం. ప్రస్తుతం అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పథకం మంచి చెడుల గురించి అనేక కోణాల్లో చర్చ జరుగుతోంది. ఇంకా లోతైన చర్చ జరగవలసిన అవసరం కూడా వుంది. నిజానికి ఈ చర్చ ఏదో ప్రకటనకు ముందే జరిగి ఉంటే ఇంత అశాంతి, అలజడి, విధ్వంసం, ఇంత ఆస్థి నష్టం జరిగి ఉండేది కాదేమో. అన్నిటినీ మించి సైన్యంలో చేరి దేశసేవ చేసేందుకు సిద్దమైన ఎన్నోవేల మంది యువకులు, ఆందోళనలో పాల్గొన్న కారణంగా సైన్యం చేరేందుకే కాదు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యారు. ఎవరో రగిలించిన జ్వాలకు యువత తమ జీవితాలను ప్రశ్నార్ధకం చేసుకుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది నిజం, ఆందోళనలకు రాజకీయ పార్టీలా, శిక్షణ సంస్థల యాజమాన్యాలా ఎవరు బాధ్యులు అనే విషయం పక్కన పెడితే, ఈ ఆందోళనల వలన నష్ట పోయింది , పోతోంది మాత్రం సైన్యంలో చేరేందుకు సిద్దమైన యువకులే, ఇది కాదన లేని నిజం. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదే విషయం స్పష్టం చేశారు. సైన్యంలో చేరాలనుకునే ప్రతి అభ్యర్ధి తాను ఎన్నడూ ఎలాంటి ఆందోళనలు, దాడుల్లో పాల్గొనలేదని ప్రతిజ్ఞ చేయాలని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ.. స్పష్టం చేశారు. అగ్నివీరులుగా ఎంపికయ్యే సమయానికి పోలీసు వెరిఫికేషన్ జరుగుతుందని వెల్లడించారు. అంటే, గత నాలుగైదు రోజుల్లో జరిగిన హింసాత్మక సంఘటనలో పాల్గొన్న యువకులు సైన్యంలో కాలు పెట్టే అర్హతను కోల్పోయారు. అదలా ఉంటే, అగ్నిపథ్ పథకం పై రాజకీయ నాయకులు, ముఖ్యంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పద మవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు, అగ్నివీరులను తమ పార్టీ ఆఫీసుకు సెక్యూరిటీగా గార్డులుగా పెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేశారు. నిజమే కావచ్చును, సెక్యూరిటీ సిబ్బందిగా, పనిచేయడం చిన్నతనం కాదు. కానీ ఇలాంటి సమయంలో అలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు. అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే విధమైన అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే అదనుగా కైలాష్ విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శివసేన, ఎంఐఎం మండిపడ్డాయి.ప్రభుత్వం సైన్యాన్ని అవమానిస్తోందని ఆరోపించాయి. దీంతో ‘అగ్ని’కి ఆజ్యం తోడైంది. మరోవంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంక వాద్రా, అసలు విషయాన్ని పక్కన పెట్టి, యువత మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని. పిలుపు నిచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది.
మరోవంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంక వాద్రా, అసలు విషయాన్ని పక్కన పెట్టి, యువత మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని. పిలుపు నిచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. అగ్నిపథ్‌పై ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగా.. మరోవైపు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ ప్రభుత్వం పథకం ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో నోరు జారి వివాదాలు సృష్టించడం విజ్ఞత అనిపించుకోదని, విజ్ఞులైన పెద్దలు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/provoking-statements-by-politicians-on-agnipath-25-138041.html





