మహిళలకు 40 శాతం సీట్లు.. యూపీలో ప్రియాంక ఫార్మూలా హిట్టయ్యేనా?
Publish Date:Oct 20, 2021
Advertisement
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంక వాద్రా కొత్త కొత్త ఆలోచనలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అద్ద్వాన్న స్థితికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రియాంక, ముందుండి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవల్ లఖింపూర్ ఖేరి సంఘటన నేపధ్యంగా ప్రియాంకా వాద్రా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై ఆమె వీరోచితంగా పోరాడారు. యూపీలో కాంగ్రెస్ బతికే వుందని, పార్టీ నాయకులు, క్యాడర్’కు భరోసా ఇచ్చేందుకు ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇప్పటికే సుదీర్ఘ పాద యాత్రకు ప్లాన్ చేసిన ప్రియాంక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం (2022) ప్రారంభంలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫు నుంచి 40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే 160 మందికి అసెంబ్లీలో మొత్తం సభ్యులు 403) హస్తం పార్టీ టికట్ ఇస్తుందని ప్రియాంక చెప్పారు. అయితే ఇంత మంది అభ్యర్ధులు దొరుకుతారా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి అనుకోండి. అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ సూత్రం ప్రాయమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రియాంక మహిళలు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందని అన్నారు. నిజానికి యూపీలో మహిళలపై ఎలాంటి అత్యాచారం, హత్యలు ఎలాంటి నేరాలు ఘోరాలు జరిగిన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక అందరికంటే ముందుగా స్పదించే వ్యక్తిగా , వార్తల్లో నిలిచారు. కొంతకాలం క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్, హథ్రాస్ అత్యాచార ఘటనల విషయంలో ప్రియాంక గట్టిగా పోరాటం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలికల కోసం, మార్పును కోరుకునే మహిళల కోసం, కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లోమహిళలకు 40 శాతం సీట్లు కేటాయించాలనే నిర్ణయం తీసుకుందని ప్రియాంక చెప్పారు.”మహిళలు మార్పు తీసుకురాగలరు. వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న విద్వేష రాజకీయాలను మహిళలు మాత్రమే అంతం చేయగలరు. మీరు నాతో కలిసి పనిచేయాలని అభ్యర్థిస్తున్నా” అని అన్నారు. కాగా ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 40 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. అదులో 35మంది బీజీపీ సభ్యులు. కాంగ్రెస్, బీఎస్పీ తరపున ఇద్దరేసి ఉన్నారు. ఎస్పీ తరపున ఒకే ఒక్క మహిళ విజయం సాధించారు.
http://www.teluguone.com/news/content/priyanka-gandhi-anoounce-40-percent-seats-to-women-in-up-25-124839.html





