ఏకగ్రీవం దిశగా రాష్టపతి ఎన్నిక .. సామ్నాసంకేతం ?
Publish Date:Jun 18, 2022
Advertisement
రాష్ట్ర పతి ఎన్నికను ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా తీసుకోవడం లేదా? అందుకే, ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నాయా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అది కూడా, ఇంకెవరి నుంచో కాదు, ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్రను పోషిస్తున్న, బీజేపీ మాజీ మిత్ర పక్షం, మహారాష్ట్ర అధికార కూటమికి నేతృత్వం వహిస్తోన్న శివసేన పార్టీ, ఈ సందేహాన్ని వ్యక్త పరిచింది. సందేహాన్ని వ్యక్త పరచడమే కాదు, ఇలా అయితే ఎలా? రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్ట లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన ప్రధానమంత్రి అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని హెచ్చరించింది. శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్ పేజీలో ప్రచిరించిన వ్యాసంలో ప్రతిపక్షాల ఐక్యత పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించ వలసిన అవసరం ఉందని, పేర్కొంది. అంతే కాదు, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావనకు వచ్చినా, ఆయన నో’ అన్న నేపధ్యంలో మమతా బెనర్జీ మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫరుక్ అబ్దుల్లా పేర్లను ప్రతిపాదించారు. అయితే ఈ పేర్ల విషయంలో శివసేన పెదవి విరించింది. బీజేపీ అభ్యర్ధికి ఆ ఇద్దరిలో ఎవరూ గట్టి పోటీ ఇవ్వలేరని, కేవలం పోటీ చేశామంటే చేశామనేందుకు మాత్రమే పనికొస్తారని ‘సామ్నా’ సంపాదకీయ వ్యాసంలో పేర్కొంది. బీజేపేని దీటుగా ఎదుర్కొని గట్టిపోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థి అవసరం అంటూ ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక విషయంలో ప్రతిపక్షాల తీరును పరోక్షంగానే అయినా గట్టిగా ఎండగట్టింది. అదేవిధంగా ఎన్డీయే అభ్యర్థిగా సమర్థుడైన వ్యక్తిని నిలబెట్టే అవకాశం ఉండకపోవచ్చని, ప్రస్తుత రాష్ట్రపతి రాంమ్ నాథ్ కొవింద్ ఎంపిక సమయంలోనూ బీజేపీ ముందు ఇద్దరు ముగ్గురు పేర్లను చర్చకు తెచ్చి చివరకు కొవింద్’ను ఏంక చేసిందని సామ్నా వ్యాసం పేర్కొంది. ఇప్పుడు కూడా, ప్రస్తుతం వినిపిస్తున్న వారు కాకుండా ఇంకొకరని తెర మీదకు తెచ్చే అవకాసం ఉందని సామ్నా అభిప్రాయపడింది. అంటే, ప్రతిపక్షాలు బలమైన అభ్యర్ధిని నిలిపితే గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని తద్వారా బీజేపీ దూకుడుకు కళ్ళెం వేయవచ్చనే అభిప్రాయం సామ్నా వ్యక్తపరిచింది. అయిత, ఎవరా బలమైన అభ్యర్ధి, అనే ప్రశ్నకు సామ్నా సమాధానం ఇవ్వలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ నిరాకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ప్రశ్నకు ఇప్పడు కాదు, ఆరు నెలల క్రితమే సమాధానాలు కనుగొని ఉండవలసింది అని నిష్టూరమడింది. అంతే కాకుండా, ఇంకొక అడుగు ముందుకేసి, దీంతో ప్రతిపక్ష పార్టీల చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని మరో రాయి విసిరింది. అయితే మరో రెండు రోజుల్లో, జూన్ 20,21 తేదీలలో శరద్ పవార్ నాయకత్వంలో ముంబై ప్రతిపక్ష పార్టీల సమావేశం జరగనున్న సమయంలో శివసేన, ఈ బాంబు ఎందుకు పేల్చింది? అదికూడా, శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట పతి ఎన్నిక ఏకగ్రీవం విషయంగా చర్చలు జరిపిన రోజునే సామ్నా సంపాదకీయ వ్యాసంలో ప్రతిపక్షాల ఐక్యత పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాసం రావడం అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. కాగా, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు, ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను బీజేపీ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రాజ్ నాథ్ సింగ్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో గురువారం ఫోను ద్వారా చర్చలు జరిపారు. సో.. సామ్నా వ్యాసం రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి సంకేతామా? అంటే, అయినా కావచ్చని, నిజానికి కాంగ్రెస్, ఎన్సీపీ సహా చాలా వరకు పార్టీలు పోటీ కంటే ఏకగ్రీవం వైపే మొగ్గు చూపుతున్నాయని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/president-election-unanimous-samna-indicates-25-137935.html





