కల్వకుంట్ల కవిత.. ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఏం జరుగుతోంది?
Publish Date:Jan 20, 2026
Advertisement
తెలంగాణ జాగృతి అధినేత్రి పొలిటికల్ జర్నీకి ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహకారం అందించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. స్వల్ప వ్యవధిలో ప్రశాంత్ కిషోర్, కల్వకుంట్ల కవిత మధ్య రెండు సార్లు భేటీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో కవితకు రాజకీయ సలహాదారుగా, వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేయనున్నారని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. తన సొంత రాష్ట్రం బీహార్ లో మాత్రం సొంత పార్టీని ఎన్నికలలో విజయపథంలో నడిపించే విషయంలో ఘోరంగా విఫలమై బొక్కబోర్లా పడ్డారు. సొంత పార్టీ జన సురాజ్ ను ఏర్పాటు చేసి, బీహార్ లో సుదీర్ఘ పాదయాత్ర చేసి, విస్తృత ప్రచారం చేసి కూడా ఇటీవలి ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ తన పార్టీ నుంచి కనీసం ఒక్కరంటే ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు. జనసురాజ్ అభ్యర్థులెవరూ కనీసం డిపాజిట్ కూడా దక్కించు కోలేకపోయారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ వ్యూహకర్త అవతారం ఎత్తడమే ప్రశాంత్ కిశోర్ ముందు ఉన్న మార్గమని పరిశీలకులు గత కొంత కాలం నుంచీ చెబుతూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ కల్వకుంట్ల కవిత భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ఎమ్యెల్సీ, మాజీ ఎంపీ, అన్నిటికీ మించి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత, తన తండ్రి నేతృత్వంలోని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ తో ఆమె భేటీ ఎనలేని రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రశాంత్ రెండు నెలల వ్యవధిలో కవితతో రెండు సార్లు భేటీ అయ్యారనీ, వాటిలో రెండో భేటీ సంక్రాంతి సీజన్ లో జరిగిందనీ సమాచారం. ఈ భేటీలలో వారిరువురి మధ్యా ప్రధానంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ అజెండా, ప్రచారం తదితర అంశాలపై చర్చ జరిగిందని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ కు తెలుగు రాజకీయాలతో మంచి పరిచయం ఉంది. గతంలో అంటే 2019లో వైఎస్ జగన్ కు రాజకీయ, ఎన్నికల వ్యూహాలను అందించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల కారణంగానే 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించారని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ చెబుతుంటారు. అలాగే 2023 ఎన్నికలకు ముందు కొద్ది కాలం పాటు ఆయన బీఆర్ఎస్ కు కూడా వ్యూహకర్తగా పని చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే... కవిత రాజకీయంగా సొంత మార్గం వేసుకుని సొంతగా నడక ప్రారంభిం చనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడమే కాకుండా, తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేలా వ్యూహరచన చేయడానికి ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారన్న చర్చ ఈ భేటీల అనంతరం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. అయితే తాను కల్వకుంట్ల కవితకు రాజకీయ వ్యూహకర్తగా పని చేయనున్నట్లు వస్తున్న వార్తలను ప్రశాంత్ కిశోర్ ఖండించారు. తాను ఇప్పటికే రెండు సార్లు ఆమెతో భేటీ అయ్యి పార్టీ ఏర్పాటు గురించి చర్చించినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.
http://www.teluguone.com/news/content/prashant-kishore-as-political-strategist-for-kavitha-25-212747.html





