జూబ్లీహిల్స్ పీఎస్‌లో లొంగిపోయిన ప్రభాకర్ రావు
Publish Date:Dec 12, 2025
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ఇవాళ ఉదయం 11 గంటలకు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. కోర్టు ఆయనపై ఉన్న ముందస్తు బెయిల్‌ను సడలిస్తూ వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆయన సిట్ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రభాకర్‌రావు తన సెల్‌ఫోన్ పాస్‌వర్డ్‌లు ఇవ్వడానికి నిరాకరించినట్లు సిట్ తన పిటిషన్ లో పేర్కొంది. అదేవిధంగా, సెన్సిటివ్ సమాచారం ఉన్న దశాబ్దాల డేటాను ధ్వంసం చేయించినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది.ఇంకా ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న ముఖ్యమైన వివరాలను కూడా ప్రభాకర్ రావు దాచి పెడుతున్నారని కస్టోడియల్ విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని అందచేత ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ రద్దుచేసి కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతూ పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు సిట్ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపి... ముందస్తు బెయిల్ ను సడలిస్తూ... వారం రోజులపాటు కస్టోడియల్ విచారణకు అనుమతించింది. దీంతో సిట్ అధికారులు నేటి నుంచి వారం రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రభాకర్‌రావును జాయింట్ సీపీ తఫ్సర్ ఇక్బాల్ నేతృత్వంలోని సిట్ ప్రశ్నిస్తోంది. టెలికమ్యూనికేషన్స్ చట్టంలోని రూల్ నెంబర్ 419, 419A ఉల్లంఘిస్తూ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్లను అనుమతి లేకుండా ట్యాప్ చేసినట్లు గుర్తించారని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా మొత్తం 26 హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు సిట్ గుర్తించింది. ఇందులో 7 కొత్త హార్డ్‌డిస్క్‌లను రీప్లేస్ చేసిన అంశంపై కూడా లోతుగా విచారిస్తోంది.ధ్వంసం చేసిన డిస్క్‌లను ఎక్కడ దాచి పెట్టారనే కీలక ప్రశ్నకు సమాధానం కోసం సిట్ కస్టడీ విచారణను అత్యంత వేగవంతం చేసింది.
http://www.teluguone.com/news/content/prabhakar-rao-surrendered-36-210875.html





