డ్రగ్స్ దందాలో పోలీసు అధికారి కుమారుడు!?
Publish Date:Jul 15, 2025
Advertisement
హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ అధికారి కుమారుడి పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్టు తర్వాత పోలీసులు ఆ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబీ అధికారి కుమారుడి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం ఈగిల్ అధికారులను షాక్ కు గురి చేసింది. ఈ పోలీసు అధికారి కొడుకు పాత్ర పై ఆరా తీస్తున్న క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. 2024లో ఎస్ఐబీ అధికారి కుమారుడు డ్రగ్స్ వ్యవహారంలో ఓ సారి పట్టుబడినా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేసిన విషయం కూడా ఈగిల్ అధికారులు గుర్తించారు. ఈ ఎస్ఐబీ పోలీస్ అధికారి ప్రస్తుతం ఓఎస్డీ గా ఎస్ఐబీ లోనే కొనసాగుతున్నారు. ఈ ఎస్ఐబీ అధికారిని ఫోన్ టాపింగ్ కేసులో ప్రాథమికంగా అనుమానించినప్పటికి ఆ తర్వాత ఆయన అప్రూవర్ గా మారాన్న ప్రచారం జరిగింది. ఫోన్ టాపింగ్ కేసులో ఈ అధికారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు చెబుతున్నారు. అదలా ఉంటే తాజాగా ఆయన కుమారుడి పేరు డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేనితో పాటు అరెస్టు అయిన ఆరుగురిని ఈగిల్ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరికొంత మంది సెలబ్రిటీలతో పాటు ప్రముఖుల చిట్టా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈగిల్ అధికారులు వారం రోజుల కిందట వారికి అందిన సమాచారం మేరకు కొంపల్లి లోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంలో ఈగిల్ పోలీసులకు రాహుల్ తేజ గురించి తెలిసింది. అతడి గురించి ఆరా తీసినప్పుడు 2024 జనవరిలో నిజామాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో ఏ3 నిందితుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. కాగా ఈగిల్ అధికారుల దర్యాప్తులో రాహుల్ తేజ డ్రగ్స్ సరఫరాదారనీ, అతడు డ్రగ్స్ ను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ల నుంచి తీసుకువచ్చేవాడని గుర్తించారు. అలాగే ఈగిల్ దర్యాప్తులో రాహుల్ తేజ ఎస్ఐబీ లో రిటైర్ అయ్యి , ప్రస్తుత్తం ఓఎస్డీగా పని చేస్తున్న ఓ అధికారి కుమారుడని తేలింది. దీంతో ఈగిల్ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో ఎస్ఐబీ అధికారి కుమారుడి వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లి అతని పై చర్యలకు తీసుకునేందుకు ఈగిల్ అధికారులు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/police-officer-son-name-in-drugs-case-39-202015.html





