ఫోన్ టాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ ప్రకంపనలు
Publish Date:Dec 24, 2025
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును కొత్త సిట్ చేపట్టిన తరువాత కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సిట్ చేతికి చిక్కిన ఒక పెన్ డ్రైవ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు బావిస్తున్నాయి. మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పదేపదే మాజీ డిజిపి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రస్తావిం చడంతో అప్పటికే సిట్ అధికారులు మాజీ డిజిపి ని విచారణ చేసి వాంగ్మూలం నమోదు చేశారు. అలాగే ఫోన్ టాపింగ్ రివ్యూ కమిటీ లో సభ్యులైన మాజీ సిఎస్ లు సోమేష్ కుమార్, శాంత కుమారి ఇతర అధికారులు తిరుపతి, శేషాద్రి లను కూడా విచారించారు. ఇక మంగళవారం ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇక బుధవారం(డిసెంబర్ 24) సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన పెన్ డ్రైవ్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. ఈ కేసుకు సంబంధించిన ఈ పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారను న్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తన పదవీకాలంలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన కీలక వివరాలను ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి ఉంచినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్స్ కూడా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ఫోన్ టాపింగ్ గురైన ఫోన్ నెంబర్ల ను ఇప్పటికే గుర్తించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం కొనసా గుతున్న సమయంలో పోలీసుల చేతికి చిక్కకుండా ప్రభాకర్ రావు టీమ్ అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా కూడా ఈ పెన్ డ్రైవ్ ప్రత్యేక దర్యాప్తు బృందం చేతికి చిక్కడం దర్యాప్తులో కీలక మైలురాయిగా మారింది. ఈ కేసు ఛేదించడానికి పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికా రులు చెబుతున్నారు. ప్రభాకర్ రావు నుండి ఇంకా పూర్తి వివరాలు సేకరించేందుకు ఎల్లుండి వరకూ విచారించడానికి సమయం ఉందని అధికారులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/pendrive-key-in-phone-taping-case-25-211496.html





