సాయం మాటల్లో కాదు చేతల్లో.. గిరిజనానికి పాదరక్షలు అందించిన పవన్ కల్యాణ్
Publish Date:Apr 18, 2025
Advertisement
సహాయం అన్నది మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అన్న విషయాన్ని పవన్ కల్యాణ్ నిరూపించారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆదివాస గ్రామం డుంబ్రిగుడలో ఆయన గిరిజనులతో మమేకమయ్యారు. ఆ సందర్భంగా గ్రామంలో దాదాపు ఎవరూ పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్లతోనే ఉండటాన్ని గమనించారు. సరైన రహదారుల లేని గిరిజన గ్రామాలలో గిరిజనం చెప్పులు కూడా లేకుండా నడవాల్సిన పరిస్థితికి చలించిపోయారు. అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆయన గిరిజన గ్రామాలకు రహదారులు వంటి ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని త్వరలోనే ఆరంభిస్తానని నమ్మబలికారు. అయితే ఆ వాగ్దానాలతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ వారికి ఓ అనూహ్య బహుమానం ఇచ్చారు. చెప్పుకోవడానికి అది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అందరి హృదయాలనూ హత్తుకునే ఉదాత్త చర్య అనడంలో మాత్రం సందేహం లేదు. ఇంతకీ పవన్ కల్యాణ్ చేసింది ఏమిటంటే డుంబ్రిగుంట గ్రామ గిరిజనులకు ఆయన పాదరక్షలు పంపించారు. తన టీమ్ ద్వారా మొత్తం గ్రామ ప్రజలందరికీ పాదరక్షలు అందించారు. గ్రామంలో ఎంద మంది ఉన్నారు, వారికి ఏ సైజు పాదరక్షలు అవసరం తదితర వివరాలన్నిటినీ సర్వే చేయించారు. గురువారం (ఏప్రిల్ 17)న డుంబ్రిగుంట గ్రామస్తులకు పాదరక్షలు అందజేయించారు. డుబ్రిగుంట గ్రామంలో ఉన్న 345 మందికి పాదరక్షలు అందచేయించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పాదరక్షలు అందజేశారు. కోరకుండానే కష్టం తెలుసుకుని, అవసరాన్ని గుర్తించి తమకు పాదరక్షలు అందించిన పవన్‌కు గిరిజనం కృతజ్ణతలు తెలిపారు.
http://www.teluguone.com/news/content/pawan-gives-footwear-to-tribals-39-196475.html





