తానా సభల్లో జగన్ ని టార్గెట్ చేసిన పవన్
Publish Date:Jul 6, 2019
Advertisement
విదేశాల్లో జరిగే తెలుగు సభలకు, సమావేశాలకి దూరంగా ఉండే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి తానా సభలకు హాజరయ్యారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయిన పవన్ ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తానా సభకి వెళ్లినట్టు చెబుతున్నారు. తానా కేవలం కమ్మ కులానికే చెందిదనే ప్రచారం ఉండనే ఉంది అయినా పరాజయం తాలూకా పాఠం దెబ్బకు పవన్ ఎక్కడికయినా ఎంత దూరం అయినా వెళ్తున్నారు. అలా రెండో రోజు తానా సభల్లో ఆయన ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయనీ అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదనీ, ఆల్రెడీ డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని విమర్శించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓటమి నుండి విజయాన్ని అందుకోవడం నెల్సన్ మండేలా నుండి, థామస్ అల్వా ఎడిసన్ నుండి తాను నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. తనకు ఓర్పు ఎక్కువని, ఎన్ని అడ్డంకులు కష్టాలు ఎదురైనా విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తానని పేర్కొన్నారు. డబ్బులిచ్చి ఓట్లు సంపాదించి గెలవడం కంటే డబ్బులు ఇవ్వకుండా ఓట్లు రాకుండా ఓడిపోయినా... ఆ అపజయాన్ని తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. జనసేన ఓటమి తర్వాత.. ఆ పరాజయాన్ని జీర్ణించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాలే పట్టిందని ఎందుకంటే తాను డబ్బు పంచి ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు ముందే తెలుసన్న పవన్ జైల్లో కూర్చొని వచ్చిన వాళ్లు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నప్పుడు ఏ తప్పూ చేయని తాను ఎందుకు బాధపడాలని పరోక్షంగా అధికార పార్టీని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్.
http://www.teluguone.com/news/content/pavan-kalyan-targets-jagan-in-tana-meeting-39-87844.html





