కొత్త గవర్నర్ ఎదుట పాత డిమాండ్
Publish Date:Feb 26, 2023
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ రెండురోజుల కిందట (ఫిబ్రవరి 24) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు తిరగక ముందే ఆయన ఢిల్లీ వెళ్లారు. రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మరి కొందరు కేంద్ర మంత్రులతో సమావేశ మయ్యారు. నిజానికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్ ఢిల్లీ వెళ్ళడం వెనక ఏదో ఉందని అనుకోవలసిన అవసరం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర పెద్దలను కలిసి కృతఙ్ఞతలు చెప్పడం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే, గవర్నర్ సయ్యద్ నియామకం జరిగిన క్షణం నుంచి అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్ సయ్యద్ ఢిల్లీ పర్యటనకు కొంత రాజకీయ ప్రాధాన్యత ఉన్నా ఉండవచ్చును. అందుకే గవర్నర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాలలో అసక్తి రేకెత్తిస్తోంది. అదలా ఉంటే గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే, సిబిఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ రాష్ట్ర్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం సమర్పించాలని గవర్నర్ ను కోరారు. ఈ మేరకు ఆయన, ట్విట్టర్ ద్వారా నేరుగా గవర్నర్ కు వినతి పత్రం పోస్ట్ చేశారు. అంతేకాదు, గవర్నర్ తో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సేతారామన్ ను ట్యాగ్ చేశారు. నిజానికి కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయనతో ఇంచు మించుగా 40 నిముషాలకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా, శాంతి భద్రతల పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించినట్లు సమాచారం. అదలా ఉంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇతర నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష డిమాండ్ ను ఇంతవరకు పట్టించుకోలేదు. అందుకే జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితిని నేరుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. అలాగే మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆ విధంగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని లక్ష్మీనారాయణ గవర్నర్ ను కోరారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడుతోన్ననేపథ్యంలో ప్రజల్లో గందరగోళం నెలకొందని లక్ష్మినారాయణ వినతి పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితిని తెలుసుకునే అధికారం ప్రజా ప్రతినిథులకే కాకుండా ప్రజలకు కూడా ఉంటుందని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యకలపాలలలో పారదర్శకత అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టులో వుంది. ఆయన ఎలా స్పందిస్తారనేది చూడవలసి ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/old-demand-before-new-governer-39-151923.html





