విపక్షాల పై కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్?
Publish Date:Feb 26, 2023
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ మనసులో ఏముందో ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఉహించడం కష్టం. అందుకే అయన ఏమి చేసినా ఏమి చేయక పోయినా ఏం మాట్లాడినా, ఏదీ మాట్లాడక పోయినా మీడియా ఫోకస్ మాత్రం ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది. ఈ మధ్య కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. కానీ గత మూడు నాలుగు రోజులుగా ఆయన బీఆర్ఎస్ ముఖ్యనేతలు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు ఎందుకు జరుపుతున్నారు? ఏమిటి చర్చిస్తున్నారు? అనేది ఎవరికీ తెలియక పోయినా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికలపై దృష్టి కేద్రీకరించి నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మునుగోడు ఉప ఏన్నిక తర్వాత అంతర్గత కలహాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మరో మారు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలు రెండూ ఎవరి దారిన వారు, తమ పని తాము చేసుకు పోతున్నారు. ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంచార్జి, మాణిక్‌రావు ఠాక్రే ఎక్కువ తక్కువలు లేకుండా, అందరికీ బాధ్యతలు అప్పగించారు. ఎవరికీ వారు హాత్ సే హాత్ జోడో యాత్రలలో బిజీ అయిపోయారు. కొట్లాటలు సర్దు మణిగాయి. కార్యకర్తలలో మళ్ళీ జోష్ పెరిగింది. మరో వంక బీజేపీలో అంతర్గత తగవులు తెరపై కొచ్చాయి. మరో వంక బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఎందుకనో ఏమో కానీ, ముందులా తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద చూపడం లేదు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలు వరసగా వాయిదా పడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పొగడ్తలతో ముంచెత్తి, రాజేసిన సెగలు, పొగలు బీజేపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సో ఇదే అదనుగా ముందస్తుకు వెళితే, బీజేపీని కట్టడి చేయడం మరింత సులువవుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఓ పది సీట్లు ఎక్కువ వచ్చినా, పట్టుకొచ్చుకోవడం ఈజీ అవుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి మళ్ళీ మరో మారు ముందస్తు ఎన్నికలపై మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు. అయితే ముందస్తు ఎన్నికల సంగతి ఎలా ఉన్నా, నవంబర్ , డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికలకు, ఆరు నెలలు ముందుగా అంటే, ఏప్రిల్, మే నాటికి అభ్యర్ధులను ఖరారు చేసందుకు వీలుగా ముఖ్యమంత్రి ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు. నిజానికి గతంలో ముఖ్యమంత్రి సిట్టింగులు అందరికీ సీట్లు ఖాయం అని ప్రకటించారు. అయితే ఇప్పడు, కొంత మందికి మొండి చేయి చూపించక తప్పదన్న వాదన వినిపిస్తోంది. వామ పక్ష పార్టీలతో ప్రత్యక్ష పొత్తులు, కాంగ్రెస్ లోని ఒక వర్గంతో లోపాయికారి ఒప్పందాలు, తదితర తాజా పరిణామాలను బేరీజు వేసుకుని కొత్త జాబితా సిద్దం చేస్తునట్లు చెపుతున్నారు. సర్వే నివేదికలు సాకుగా చూపి కొందరు సిట్టిగులకు మొండి చేయి చూపించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఅర్ గెలుపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి వేర్వేరు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి సాధ్యమైనంత త్వరలో పంపించాలని నిర్ణయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ విస్తరణ చేయాలంటే.. మూడో సారి గెలిచి తీరాలి. మూడోసారి గెలవాలంటే ముందస్తుకు పోవడంతో పాటుగా, సిట్టింగులలో కొందరు త్యాగాలకు సిద్దం కావలసి ఉంటుంది. ముందస్తుకు వెళ్ళేలా ఉంటే, ఏప్రిల్ మే లలో గే కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చకూడా నడుస్తోంది. గతంలో అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థుల్నిప్రకటించారు. ఈ సారి కూడా అలా జరిగే అవకాశం ఉందని, అంటున్నారు. ముందస్తుకు వెళ్ళేలా ఉంటె వారం పది రోజుల్లో అసెంబ్లీ రద్దు, అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని లేదంటే, ఏప్రిల్ మే నెలలలో అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఏదైనా కేసీఆర్ విపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-surgical-strike-on-opposition-parties-39-151921.html





