వైసీపీకి నెగటివ్ స్టార్ క్యాంపెయినర్లు అసంఖ్యాకం!
Publish Date:Aug 11, 2023
Advertisement
సినిమాలు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ముఖ్యంగా మన దక్షణాదిలో అయితే ఈ అనుబంధం మరింత పెనవేసుకుపోయింది. అందునా మన తెలుగు రాష్ట్రాలలో అయితే సినిమా, రాజకీయం వేరు కాదు.. రెండూ ఒక్కటే అనేలా ఉంటుంది పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన తెలుగు దేశం పార్టీకి పునాదే సినీ గ్లామర్. తనను దేవుణ్ణి చేసి ఆరాధించిన తెలుగు ప్రజల ఋణం తీర్చుకొనే ఉద్దేశంతో తారకరాముని ఆలోచన నుంచి పుట్టిందే తెలుగు దేశం పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ తెలుగు సినీ పరిశ్రమ నుండి పుష్కలంగా సపోర్ట్ ఉంటుంది. ప్రస్తుతం టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లకు కొదువే లేదు. సీనియర్ స్టార్ హీరో, ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఇప్పటికే తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండగా.. మిగతా నందమూరి హీరోలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఎడమొహంగా ఉన్నారని ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకూ ఎక్కడా తనకై తాను అలా మాట్లాడిన దాఖలాలు లేవు. పైగా తన కట్టే కాలే వరకూ తన మద్దతు తెలుగుదేశం పార్టీకే అని జూనియర్ విస్పంష్టంగా చెప్పారు కూడా. నందమూరి హీరోలు కాకుండా నారా రోహిత్ తో పాటు మరికొందరు సీనియర్ హీరోయిన్లు, సీనియర్ నటులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు టీడీపీ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక, ఏపీలో మరో పార్టీ జనసేన పుట్టుక కూడా సినిమా ఛరిష్మాను ఆధారం చేసుకుని పుట్టిందే. భారీ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ఈ పార్టీకి అతిపెద్ద స్టార్ కాగా.. మిగతా మెగా ఫ్యామిలీ కూడా జనసేన వెంటే నడుస్తున్నారు. కనుక జనసేనకి కూడా సినిమా పరిశ్రమ నుండి స్టార్ క్యాంపెయినర్లకు ఎలాంటి ఢోకా లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలో సినిమా పరిశ్రమ నుండి ఎవరు వచ్చినా కండువాలు కప్పి వాళ్లనే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లుగా చూపించారు. వీళ్ళలో కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, యాంకర్ శ్యామల లాంటి వారు ఇప్పటికే వైసీపీ గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు. మోహన్ బాబు, జీవితా రాజశేఖర్ పత్తా లేకుండా పోయారు. జయసుధ మరో పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతానికి వైసీపీలో ఉన్న సినీ నటులు కమెడియన్ అలీ, పోసాని కృష్ణమురళి మాత్రమే. ఈ ఇద్దరిలో అలీ ప్రచారం దేవుడెరుగు బయటకొచ్చి మాట్లాడడం కూడా తక్కువే. ఇక మిగిలింది పోసాని కృష్ణ మురళి. పోసాని ఎలా మాట్లాడినా అది కామెడీనే అవుతుంది తప్ప పట్టించుకొనే వాళ్ళే ఉండరు. ఇలా మొత్తానికి వైసీపీకి ఇప్పుడు స్టార్ క్యాంపైనర్లే లేకుండా పోయారు. ఆ మాటకొస్తే వైసీపీకి క్యాంపెయినర్లు లేకుండా పోవడం మాత్రమే కాదు.. నెగటివ్ క్యాంపెయినర్లు పెరిగిపోతున్నారు. టీడీపీ, జనసేనకు మద్దతుగా ఉన్న హీరోలు, నటులతో పాటు న్యూట్రల్ గా ఉండే సినీ నటులు కూడా వైసీపీ అంటే ఛీ కొట్టే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తన సంక్షేమ పథకాల కోసం కోట్ల వ్యయం చేసి మరీ ఇస్తున్న ప్రకటనల కంటే.. వైసీపీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై సినిమా వాళ్ళు చేసే విమర్శలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. స్వయంగా సీఎం బటన్ నొక్కుడు కార్యక్రమాల సందర్భంగా చేస్తున్న ప్రసంగాల కంటే సినిమా వాళ్ళ విమర్శలే ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా వైసీపీకి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా సినీ పరిశ్రమ నుంచి ఎవరూ కనీసం అభినందనలు కూడా తెలియజేయలేదు. దీంతో హార్ట్ అయిన సీఎం జగన్ తనదైన శైలిలో సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయలు, తెచ్చిన జీవోలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో సినీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున.. మహేష్, ప్రభాస్ తో కలిసి వెళ్లి ఒకసారి, నిర్మాతలతో మరోసారి సీఎం జగన్ని కలసి వచ్చారు. దీంతో జగన్ ఈగో శాటిస్ఫై అయిందే తప్ప సినిమా వాళ్ళేమీ జగన్ కోసం క్యూ కట్టి మద్దతు తెలిపింది లేదు. ఆ పరిస్థితి అలానే ఉన్నా కొంచెం బెటర్ గా ఉండేదేమో కానీ, పోయి పోయి ఎన్నికల ఏడాదిలో వైసీపీ మరోసారి సినిమా వాళ్ళతో వైరం పెట్టుకుంది. పవన్ విషయంలో ఎలాంటి విమర్శలు చేసినా రజనీకాంత్, చిరంజీవి విషయంలో వైసీపీ కాస్త తగ్గి మాట్లాడాల్సింది. వైసీపీ ప్రభుత్వం జోలికే రాని రజనీని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, చిరంజీవిపై పెద్ద ఎత్తున అటాక్ చేయడం ఇప్పుడు వైసీపీకి భారీ కీడు తెచ్చిపెడుతుంది. ఒక్కొక్కరు వైసీపీ ప్రభుత్వపై విమర్శలకు దిగుతూ నెగటివ్ స్టార్ క్యాంపెయినర్లుగా మారిపోతున్నారు. ఇక వైసీపీలో ఇప్పటికే అడపాతడపా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పోసాని కృష్ణ మురళి లాంటి వాళ్లు ఉన్నా వాళ్ల ప్రసంగాలు పార్టీకి నష్టమే చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అంటే మొత్తంగా వైసీపీలో సినీ పరిశ్రమ నుంచి పార్టీకి మద్దతుగా మాట్లాడే వారంతా స్టార్ నెగిటివ్ క్యాంపెయినర్లుగానే చెప్పవచ్చు. ఇక స్వయంగా సినీమాలతో సంబంధం లేకుండా వైసీపీ తరఫున తరచూ మీడియా ముందుకు వచ్చి దూషణల పర్వానికి తెరతీసే కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్ వంటి మాజీ మంత్రులు, మంత్రులను కూడా పరిశీలకులు స్టార్ నెగటివ్ క్యాంపెయినర్లుగానే అభివర్ణిస్తున్నారు. వీళ్లకి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న నెపంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలూ కూడా వైసీపీకి స్టార్ నెగటివ్ క్యాంపెయినర్లుగా మారిపోయారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లు కూడా వైసీపీకి స్టార్ నెగటివ్ క్యాంపెయినర్లుగా మారిపోయారు. వారు జగన్ సర్కార్ పై చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నది. మొత్తంగా వైసీపీకి పాజిటివ్ క్యాంపెయినర్ల కంటే నెగిటివ్ స్టార్ క్యాంపెయినర్లే ఎక్కువగా ఉన్నారు.
http://www.teluguone.com/news/content/number-of-star-campaigners-for-ycp-39-159823.html





