టోల్ ఎత్తివేత యోచనలో తెలంగాణ సర్కార్.. కేంద్ర అనుమతి కోసం లేఖ
Publish Date:Dec 30, 2025
Advertisement
సంక్రాంతికి ప్రజలంతా తమ సొంతూళ్లకు క్యూ కడతారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు, ప్రైవేట్ వెహికల్స్‌తో రోడ్లన్నీ కిక్కిరిసి పోతాయి. ఇక టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంటుంది. ప్రతి ఏటా నగరాల నుంచి సొంతూళ్లకు ప్రయాణమయ్యే వారికి ఇది అనుభవైకవేద్యమే. అయితే ఈ సారి ఈ ఇబ్బంది లేకుండా చేయడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలు కల్పించేలా వాహనాల టోల్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ మేరకు నిర్ణయం అయితే తీసేసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ నిర్ణయానికి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ నిర్ణయాన్ని అములు చేయడానికి సర్కార్ రెడీగా ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, విజయవాడవైపు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉరట కలుగుతుందనడంలో సందేహం లేదు. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేలన్నింటితో పోలిస్తే.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65పై రాష్ట్ర పరిధిలో ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందిద. ఈ నేపథ్యంలోనే.. పండగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలికి, ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. కాబట్టి.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల టోల్‌చార్జీలను తామే చెల్లిస్తామని., అందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/no-toll-on-highways-for-sankranth-36-211775.html





