కమలంలో చేరికలు కానరావేమి?..బండి పాదయాత్ర ప్రచారార్భాటమేనా?
Publish Date:May 3, 2022
Advertisement
బండి సంజయ్ పాదయాత్ర ప్రచారార్భాటమే తప్ప.. ప్రజాదరణ విషయంలో పెద్ద ప్లాప్ అని బీజేపీ శ్రేణుల్లోనే నిరాశ ఎదురౌతున్నది. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజలలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే లక్ష్యం అని చెప్పుకుంటూ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేర చేపట్టిన పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్ద హైప్ ఇచ్చింది. అయితే వాస్తవంగా ప్రజాదరణ, ప్రజాస్పందన విషయంలో బండి పాదయాత్ర సాధించిందేమీ లేదని కమలం శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. బండి యాత్రలో ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా తెరాస నుంచి పెద్ద ఎత్తున నేతలు కమల తీర్ధం పుచ్చుకోనున్నారంటూ బీజేపీ ప్రచారం చేసుకుంది. అయితే అలా చేరిన దాఖలాలు లేవు సరికదా, బీజేపీలో చేరతారంటూ కమలం ప్రచారం చేసుకున్న నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆ పార్టీతో మంతనాలు జరుపుకుంటున్నారు.
కమలం తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరిగిన వాళ్లలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. అయితే ఆయన కమలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు సరికదా.. సొంత గూటికి అంటే కాంగ్రెస్ లో చేరుందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే పలమూరులో కూడా తెరాస నుంచి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగిన నేతలు కూడా ఇప్పుడు కాదు మరోసారి చూద్దామంటూ మొహం చాటేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో తెరాసకు దీటుగా ఎదిగామని చెప్పుకుంటున్న కమలనాథులకు ఈ పరిణామం మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికల విజయంతో తమ బలాన్ని అతిగా ఊహించుకుని చేరికలపై ప్రచారం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఉనికే లేదనుకున్న కాంగ్రెస్ చాపకింద నీరులా బలోపేతం అవుతోందనీ, ఎన్ని అంతర్గత విభేదాలున్నా, పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టాకా ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చిందనీ అంటున్నారు. ఈ కారణంగానే బీజేపీలో చేరికలకు బ్రేక్ పడిందనీ, తెరాసలో అసమ్మతి వాదులు బీజేపీ కంటే కాంగ్రెస్ లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారనీ వారంటున్నారు.
http://www.teluguone.com/news/content/no-joinings-in-bjp-in-bandi-padayatra-25-135396.html





