ఎవరి అవిశ్వాసం వారిదే
Publish Date:Dec 9, 2013
Advertisement
రాష్ట్ర విభజన ప్రక్రియకి ముందు తెలంగాణాలో, తరువాత సీమాంధ్రలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉద్యమాలు, రాజీనామాలు, గర్జనలు, ఘీంకారాలు, ధర్నాలు, రాస్తా రోకోలు, మానవ హారాలు, (ఐదు రోజుల) ఆమరణ నిరాహార దీక్షలు, బందులు, రోడ్ షోలు, రాష్ట్రపతికి విజ్ఞప్తులు అన్నీదశలు చకచకా దాటిన తరువాత ఇక ఆఖరిగా అవిశ్వాస తీర్మానాల దశకు చేరుకొన్నాయి. ఓం ప్రధమంగా ముందు కాంగ్రెస్ నేతలే ఈ పోటీకి ఎర్ర జెండా ఊపి మొదలుపెట్టగానే, ఆ మాత్రం సైగ చాలు మేమూ అల్లుకుపోగలమంటూ తెదేపా, వైకాపాలు కూడా పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాల నోటీసుల మీద సంతకాలు గీకేసి స్పీకర్ టేబిల్ మీద పడేసి హడావుడిగా మీడియాను పిలిచి ఆసంగతి వారి చెవిన వేసేసిన తరువాత గుండెల మీద నుండి పెద్ద భారం దింపుకొన్నట్లు ‘హమ్మయ్యా!’ అని ఓ నిటూర్పు విడిచారు. కాంగ్రెస్ పార్టీలో అవిశ్వాసులు: లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, సబ్బం హరి. వైకాపాలో జగన్మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి. తెదేపాలో నామా నాగేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొణకళ్ల నారాయణరావు, రమేష్ రాథోడ్ మొత్తం అందరూ కలిపి 13 మంది ఉన్నారు. అయితే వీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాసం పెట్టదలచినప్పుడు ఒకరు ప్రతిపాదిస్తే మిగిలిన వారు దానికి సభలో మద్దతు తెలిపినా అది కూడా అవిశ్వాసమే. కానీ ఆవిధంగా చేస్తే ఆ ‘అవిశ్వాస క్రెడిట్’ అంతా సదరు పార్టీ ఖాతాలోనే జమా అవుతుంది తప్ప తమ స్వంత ఖాతాలలో జమా అవదు. పైగా ఆవిధంగా చేస్తే మళ్ళీ దానిని సీమాంధ్రలో క్లైయిం చేసుకోవడానికి కూడా వీలుండదు గనుక ఎవరి అవిశ్వాసం వారిదే. దానిని ప్రజలు అపార్ధం చేసుకోకూడదు మరి. తెలంగాణాలో క్రెడిట్ కోసం ప్రస్తుతం తెలంగాణాలో అన్నిపార్టీలు ఏవిధంగా తిప్పలు పడుతున్నాయో ఇది కూడా అటువంటిదే నన్నమాట. ఇది వినేందుకు చాలా ఎబ్బెట్టుగా ఉన్నపటికీ నిజం మాత్రం ఇదే. వీరి అవిశ్వాసాలతో ప్రభుత్వం పడిపోకున్నా, ఆ ప్రయత్నం మేమే చేసామని చెప్పుకోవడానికయినా పనికి వస్తుంది కదా! అనే వారి ప్రధాన ఉద్దేశ్యం.
http://www.teluguone.com/news/content/no-confidence-motion-39-28229.html





