కాంగ్రెస్ మళ్ళీ గోతిలో పడిందా
Publish Date:Dec 9, 2013
Advertisement
కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధిష్టానానికి ఈవారంలో గ్రహస్థితి అంత అనుకూలంగా ఉన్నట్లు కనబడటం లేదు. నాలుగు రాష్ట్రాలలో తుడిచిపెట్టుకు పోయి బాధపడుతున్న కాంగ్రెస్ అధిష్టానంపై మూలిగే ముసలి నక్కపై తాటిపండు పడినట్లు తన స్వంత పార్టీ యంపీలే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. ఒకవేళ అదికూడా దాని కుయుక్తులలో భాగమే అనుకొన్నప్పటికీ, వారిని చూసి తెదేపా,వైకాపాలు కూడా అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. ఒకవేళ ఈవిధంగా నాటకమాడి తన యంపీలపై వేటు వేసి సీమాంధ్రలో వారి రేటింగ్ మళ్ళీ పెంచి లాభపడాలని కాంగ్రెస్ అధిష్టానం దురాలోచన చేసి ఉండి ఉంటే, ఇప్పటికే పూర్తిగా కోల్పోయిన పార్టీ పరువును ఇంకా పోగొట్టుకోవడానికి అది సిద్దం అయినట్లే భావించవలసి ఉంటుంది. ఏమయినప్పటికీ, కాంగ్రెస్ యంపీలను చూసి తెదేపా, వైకాపాలు కూడా పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టబోవడంతో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో మరో అగ్ని పరీక్ష ఎదుర్కోక తప్పదు. మంచి ఊపు మీద ఉన్నబీజేపీ, ఇదే సమయంలో మధ్యంతర ఎన్నికలకి వెళ్ళడం వలన తనకి ఎక్కువ లాభం ఉంటుందని భావిస్తే, ఇదే అదునుగా భావించి వారి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్నిపడగొట్టినా ఆశ్చర్యం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెసేతర పార్టీలను కలిసి మద్దతు కూడగడుతునందున, వారు కూడా ప్రభుత్వానికి పడగొట్టేందుకు ‘సై’ అంటే కాంగ్రెస్ పని అయిపోయినట్లే. అయితే దీనివలన కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద నుండి ఒక పెద్ద సమస్య దింపుకొనే అవకాశం కూడా కలుగుతుంది. రాష్ట్ర విభజనపై ముందు నుయ్యి, వెనక గొయ్యి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆపార్టీ ఇదే అదునుగా ఈ సమస్య నుండి బయట పడవచ్చును. తమ పార్టీనే మళ్ళీ ఎన్నుకొంటే మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తిచేసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అక్కడి ప్రజలకు, ఏదో ఒక సాకు చూపి మరో రెండు మూడేళ్ళయినా ఈ సమస్యను సాగాదీస్తామని తన సీమాంధ్ర నేతల చేత అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చి ఎన్నికలలో గెలిపించమని కోరే అవకాశం ఉంది. కానీ దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేఖ పవనాలు వీస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఇది రాజకీయ ఆత్మహత్యతో సమానమే గనుక ఏ విధంగానయినా ఈ అవిశ్వాస గండం గట్టెక్కే ప్రయత్నం చేయకతప్పదు. కాంగ్రెస్ యంపీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానం సంగతి ఎలా ఉన్నపటికీ, వైకాపా, తెదేపాల తీర్మానాల వలన మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండమే ఉండవచ్చును.
http://www.teluguone.com/news/content/congress-mps-39-28232.html





