తమిళనాట సీట్ల సర్దు‘పాట్లు’ కొలిక్కి!?
Publish Date:Mar 24, 2026
Advertisement
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పొత్తుపొడుపులు కొలిక్కి వస్తున్నాయి. ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతృత్వంలోని జాతీయ ఎన్డీయే మధ్య ఇంత కాలం కుదరని సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం (మార్చి 23) చెన్నైలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కూటమి.. ఏయే పార్టీలు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయన్న విషయాన్ని వెల్లడించింది. కూటమిలోని పార్టీలు పోటీ చేసే సీట్ల వివరాలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. సీట్ల సర్దుబాటుపై తాము పూర్తి సంతృప్తితో ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుపాట్లు ముగిసి ఏకాభిప్రాయం సాధ్యమైంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అన్నాడీఎంకే సింహభాగం సీట్లను తన వద్దే ఉంచుకుంది. ఆ పార్టీ 178 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ 27 స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గత ఎన్నికలలో ఇదే పొత్తులో భాగంగా బీజేపీ కేవలం 20 స్థానాలలో మాత్రమే పోటీ చేసింది. ఈ సారి మరో ఏడు స్థానాలను అదనంగా దక్కించుకుంది. ఇక కూటమిలోని ఇతర పార్టీలలో, అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని పీఎంకే 18 స్థానాల్లోనూ, టీటీవీ దినకరన్ సారథ్యంలోని ఏఎంఎంకే11 స్థానాలలోనూ పోటీ చేస్తుంది. అదలా ఉంటే పీఎంకేలో చీలిక వచ్చింది. ఆ పార్టీ అధినేత రామదాసు తన వర్గంతో కలిసి శశికళ కూటమితో చేతులు కలపడం ఆసక్తి కరంగా మారింది. ఇక పోతే.. అధికార డీఎంకే కూటమిలో సీట్ల సీట్ల సర్దు ‘పాట్లు’ ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తమిళట డీఎంకే కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే, విజయ్ టీవీకే పార్టీ, శశికళ కూటముల మధ్య చతుర్ముఖ పోటీ ఉన్నప్పటికీ.. అందరి ఆస క్తీ టీవీకే ఈ ఎన్నికలలో చూపే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరుగుతాయి. మే 4న ఫలితాలు విడుదల అవుతాయి.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే టీవీకే అధినేత విజయ్ ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ అన్నాడీఎంకేను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నది పరిశీలకుల విశ్లేషణ.
http://www.teluguone.com/news/content/nda-seat-sharing-compleated-39-216058.html





