జగన్‌రెడ్డికి దేవుడంటే లెక్కలేదు! వెంకన్నతో పెట్టుకుంటే..
Publish Date:Dec 24, 2020
Advertisement
తిరుమలలో రూల్స్ బ్రేక్ చేస్తూ వైసీపీ నేతలు డ్రోన్ కెమెరాలు ఎగరవేయడంపై రచ్చ కొనసాగుతోంది. శ్రీవారి పవిత్రతకు వైసీపీ నేతలు భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఇదే ఘటనకు సంబంధించిన సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీవారిపై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టమని ఆయన ట్వీట్ చేశారు. జగన్‌రెడ్డికి దేవుడంటే లెక్కలేదు, ప్రజలంటే గౌరవం లేదని ఆరోపించారు లోకేశ్. వైసీపీ నాయకుల అహంకారానికి హద్దేలేదని విమర్శించారు. భక్తులపై లాఠీఛార్జ్ చేయించి హిందువుల మనోభావాలను జగన్‌రెడ్డి దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలకు రద్దు చేసుకోకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు బాగా తెలుసు జగన్‌రెడ్డి అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. తిరుమలలో భద్రత , అలాగే స్థల పవిత్రత దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. డ్రోన్ కెమెరాల వాడకం పైనా నిషేధం ఉంది. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు తమ పాదయాత్ర చిత్రీకరణకు డ్రోన్ కెమెరాను వాడారు. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 18 ఏళ్లుగా కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ద్వారా కాలిబాటన తిరుమలకు చేరుకుంటున్నారు. ఈసారి కూడా ఆయన అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారా వందలాదిమందితో కలిసి కాలినడకన తిరుమల పాపవినాశనం రోడ్డు పార్వేటి మండపం వద్దకు చేరుకున్నారు. అయితే ఈ పాదయాత్రను చిత్రీకరించేందుకు అమర్నాథ్ రెడ్డి మద్దతుదారులు కొందరు డ్రోన్ కెమెరాను వినియోగించారు. తిరుమలలో డ్రోన్ కెమెరా వాడకంపై నిషేదం ఉన్నా.. ఉపయోగించడం దుమారం రేపుతోంది. టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది కూడా అధికార పార్టీ నేతలను తనిఖీలు చేయకుండానే వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/nara-lokesh-fire-on-cm-jagan-39-108093.html





