లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.. జగన్ సంగతేంటి?
Publish Date:Aug 17, 2026
Advertisement
ఏపీ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టినా.. మండిలిలో ఆ పార్టీ సభ్యులు హాజరయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మెగా డీఎస్సీ-2025 నిర్వహణ, ఫలితాలు, వైసీపీ విమర్శలు, ఆరోపణలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ, పరీక్షల నిర్వహణ, ర్యాంకింగ్ విధానం, క్రీడల కోటా కేటాయింపులపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు. మండలిలో విపక్ష సభ్యులు లేవనెత్తిన సాంకేతిక సందేహాలకు సాంకేతిక ఆధారాలతోనే సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షం కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలో రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తోందని, నిరుద్యోగుల్లో అనవసర అయోమయాన్ని సృష్టించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అదే సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీరును దుయ్యబట్టారు. అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడే ధైర్యం లేక జగన్ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీ లేదా ఇతర అభివృద్ధి, సంక్షేమ అంశాలపై నిజంగా చిత్తశుద్ధి, బాధ్యత ఉంటే అసెంబ్లీ వేదికగా ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు. సాకులు చెబుతూ సభను బహిష్కరించి పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. వైసీపీ హయాంలో నిరుద్యోగులను ఏ విధంగా వంచించారో ప్రజలందరికీ తెలుసని లోకేష్ విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో ఉద్యోగాల భర్తీని పక్కనపెట్టి నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటన చేసి, రికార్డు స్థాయిలో పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, అభ్యర్థులకు త్వరితగతిన నియామక పత్రాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ ఉద్ఘాటించారు. సభావేదికగా లోకేష్ మోగా డీఎస్సీ విషయంలో వైసీపీ ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టారు. అదే సమయంలో జగన్ కు సవాల్ విసిరారు. లోకేష్ డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీ తనంపై క్లారిటీ ఇచ్చారు. ఇక మిగిలింది జగన్.. ఆయన సభకు హాజరై గళమెత్తుతారా? లేక ఇదే పలాయన వాదంతో సభకు ఆవల విమర్శలకు పరిమితమౌతారా తేల్చుకోవాలి. Nara Lokesh, Jagan, MegaDSC, AP Legislative Council, AP Assembly Sessions, Clarity, Challange
http://www.teluguone.com/news/content/nara-lokesh-45-229107.html




